English | Telugu
జూబ్లీ బైపోల్.. బీఆర్ఎస్ ప్రచార సారథి కేసీఆర్!?
Updated : Oct 21, 2025
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ అజ్ణాతాన్ని వీడి క్రియాశీల రాజకీయాలలోకి తిరిగి ప్రవేశిస్తున్నారా? బీఆర్ఎస్ కు చావో రేవోగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రచార సారథ్యం వహించనున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాలు ఔననే అంటున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంలో జూబ్లీ బై పోల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బైపోల్ కు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సతీమణి సునీతను రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక వచ్చే నెల 11న జరగనుంది.
ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికలో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా.. మిగిలిన పార్టీల కంటే ఈ ఉప ఎన్నిక విజయం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ఈ ఉప ఎన్నికలో విజయంపైనే ఆ పార్టీ ఉనికి, ఊపు ఆధారపడి ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నికలో పార్టీని గలిపించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా తానే ప్రచార సారథ్యం వహించాలన్న తలపుతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసినా ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రచారానికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ.. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ పార్టీ ప్రధాన ప్రచార కర్తగా, ప్రచార సారథిగా ఉంటారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
ఆ మేరకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా కేసీఆర్ పేరును కూడా బీఆర్ఎస్ చేర్చంది. ఇప్పటికే కేటీఆర్, కేసీఆర్ లు తమ ప్రచారం ప్రారంభించేశారు. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ కూడా జూబ్లీ బైపోల్ ప్రచారంలో చురుకుగా పాల్గొంటారని చెబుతున్నారు.