English | Telugu

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘనవిజయం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరుఫున పోటీ చేసిన సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికలో ఒక అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, ఆమెకు అంతకు మించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్‌లోనే కవిత విజయం పక్కా అని తేలింది. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. మొత్తం ఇక్కడ 824 మంది ఓటర్లు ఉండ‌గా, 823 మంది ప్ర‌జాప్ర‌తినిథులు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. పోలైన మొత్తం 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఏకంగా 728 ఓట్లు పోలయ్యాయి. మిగిలిన ఓట్లు కాంగ్రెస్, బీజేపీకి పోల్ అయ్యాయి. దీంతో మరికొద్ది సేపట్లో తన గెలుపుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అధికారుల నుండి కవిత అందుకోనున్నారు.