English | Telugu
జగన్ హెలికాప్టర్ వివాదం
Updated : Oct 8, 2025
జగన్ విశాఖ జిల్లా పర్యటన వివాదాస్పదమవుతోంది. జగన్ సహా పది వాహనాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశారు పోలీసులు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి మీదుగా నేషనల్ హైవే మీద వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు. రోడ్ షోలు, జనసమీకరణ చేస్తే ఆయన పర్యటన అర్ధాంతరంగా ఆపేస్తామని షరతులు విధించారు. అయితే రోడ్డు మార్గంలో జగన్ నర్సీపట్నం వెళ్లేందుకు మాత్రం అనుమతి లేదన్నారు అనకాపల్లి ఎస్పీ. అయితే అనుమతులు లేకున్నా సరే జగన్ పర్యటన జరిగి తీరుతుందంటున్నారు వైసీపీ నేతలు.
జగన్ పర్యటన రోజు అక్టోబర్ 9న, విశాఖలో మహిళల ప్రపంచకప్ మ్యాచ్ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు విశాఖ సీపీ. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే నేషనల్ హైవే బ్లాక్ అవుతుందని.. అలా జరిగితే తమిళనాడులోని కరూరులో విజయ్ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ రోజు గానీ చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, దీంతో తాము జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చేది లేదని సీపీ తెగేసి చెప్పారు. కాబట్టి జగన్ కి హెలికాప్టర్ లో వెళ్లాలని సూచించారు. అయితే
హెలికాప్టర్ పర్యటనకైతే ఓకే అంటున్న పోలీసుల తీరును వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. అదే పనిగా హెలికాప్టర్ ప్రస్తావన చేస్తున్నారంటే ఇందులో మరేదో కుట్ర కోణం ఉందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. అయితే గత రాఫ్తాడు పర్యటనలోనూ జగన్ చాపర్ వివాదం సంగతి తెలిసిందే.
జగన్ చాపర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో దానిపైకి కూడా జనం దూసుకొచ్చేశారు. దీంతో ఆ చాపర్ పైలట్ జగన్ లేకుండానే తిరిగి వెళ్లిపోయాడు.ఏది ఏమైనా జగన్ పర్యటన వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. అసలు అధికారం కోల్పోయిన తరువాత జగన్ చేపట్టిన ప్రతి పర్యటనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు