English | Telugu
సాధారణ ఎమ్మెల్యేగా చంద్రబాబు..! వింటర్‌లో షాకిచ్చేందుకు వైసీపీ పావులు
Updated : Dec 5, 2019
దారుణ పరాజయంతో దెబ్బతిన్న తెలుగుదేశం ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బ తీసేందుకు ఆర్నెళ్లుగా పావులు కదుపుతోన్న జగన్ ప్రభుత్వం... టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో ఐదారుగురికి పక్కకు లాగేస్తే, బాబుకి ప్రతిపక్ష హోదా పోయినట్లే. ఎందుకంటే, 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా దక్కాలంటే పదో వంతు సీట్లు రావాల్సి ఉంటుంది. అంటే కనీసం 17 లేదా 18మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అయితే, టీడీపీకి ప్రస్తుతం 23మంది ఎమ్మెల్యేలు ఉండటంతో... ఐదారుగుర్ని లాగేస్తే.... ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. ఇప్పుడదే పనిలో వైసీపీ సీరియస్ గా వర్క్ చేస్తోంది.
ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ లాక్కుంది. అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరకపోయినా... తెలుగుదేశం నుంచి మాత్రం బయటికి వచ్చేశారు. దాంతో, మరో ఐదుగురు ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి బయటికి లాగాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. నయానాభయానో టీడీపీ ఎమ్మెల్యేలను తనవైపుకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా విశాఖలో ఒకరిపై... గుంటూరు జిల్లాలో ఇద్దరిపై... ప్రకాశం జిల్లాలో ముగ్గురిపై గురిపెట్టినట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్... ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిని వైసీపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టడం ద్వారా తమవైపు రప్పించుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోంది.
మొత్తానికి, చంద్రబాబు టార్గెట్ గా టీడీపీ ఎమ్మెల్యేలపై గురిపెట్టిన వైసీపీ... ఈసారి సీరియస్ గా ప్రయత్నిస్తోంది. ఒకవైపు చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తూనే, ఎమ్మెల్యేలను దూరం చేయడం ద్వారా ఆత్మస్థైర్యాన్ని తీయాలని పావులు కదుపుతోంది. అలా, చంద్రబాబు స్థాయిని తగ్గించి, అసెంబ్లీలో మరింత ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. మరి, ఈ శీతాకాల సమావేశాల్లోనే బాబుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారో ఏమో చూడాలి.