English | Telugu

అమిత్ షాతో జగన్ భేటి.. హైకోర్టును తరలించండి!!

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిశారు. పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించేలా సహకరించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకి రూ.20,398 కోట్లు చాలవని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కూడా ఇదే చెప్పిందని తెలిపారు. 2017-18 ధరల సూచీని అనుసరించి సవరించిన అంచనాలు రూ.55,656 వేల కోట్లను ఆమోదించాలని, ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు సూచించాలని సీఎం కోరారు. 2005-06తో పోలిస్తే 2017-18నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిందన్నారు. ముంపు బారినపడే ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1,779 కోట్ల మేర రీయింబర్స్‌ చేయాల్సి ఉందని, 2018 డిసెంబర్‌ కు సంబంధించిన ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని సీఎం జగన్‌ తెలిపారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం , శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ గత ఆగస్టులో చట్టం కూడా చేశామని అమిత్‌షా దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టును కర్నూలుకు రీలొకేట్‌ చేసేలా నోటిఫికేషన్‌ జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. 2019లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కర్నూలులో హైకోర్టు అంశం ఉందని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. హోదాతోనే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.