English | Telugu
అమెరికాకు ఇక చావే దిక్కు.. ఇరాన్ జనరల్ సులేమణి మృతిపై విషాద ఛాయలు
Updated : Jan 6, 2020
ఇరాన్ కార్డ్ స్పోర్ట్స్ చీఫ్ జనరల్ సులేమాణి హత్యతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లో 52 కీలక వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని.. తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. మిలిటరీ సంపత్తి కోసం ఇటీవలే రెండు ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశామన్నారు ట్రంప్. ప్రపంచంలోనే తమది అతిపెద్ద అత్యంత సామర్థ్యం ఉన్న ఆర్మీ అని మా స్థావరాలపై కానీ.. పౌరులపై కాని దాడి చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా ప్రతీకార దాడులు ఉంటాయని స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభమని ప్రకటించింది. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని తెలపడం యుద్ధ నేరంగా పరిగణనలోకి వస్తుందని.. మిలిటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బతీసి చంపడం పిరికి చర్య అని తెలిపింది. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మాజాఫి వ్యాఖ్యానించారు. తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఐఎస్ పై పోరులో సాయపడేందుకు ఇరాక్ లో 5,200 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇక కెన్యా తీరంలోనే అమెరికా కెన్యా సైనికులు ఉన్న స్థావరంపై సోమాలియాకు చెందిన అల్షబాబ్ తీవ్రవాద సంస్థ ఆదివారం దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టి నలుగురుని హతమార్చామని కెన్యా దళాలు తెలిపాయి.
తమ హీరో జర్నల్ ఖాసిం సులేమానికి ఇరాన్ లో అభిమానులు భారీగా తరలి వచ్చి అశ్రునివాళులర్పించారు. నల్లని దుస్తులు ధరించి కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ బాధను వ్యక్తపరిచారు. అమెరికాకు ఇక చావే అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరాక్ నుంచి సులేమాని మృతదేహం ఇరాన్ లోని ఆహ్వాస్ పట్టణానికి చేరింది. అతనితో పాటు మరణించిన వారి మృతదేహాలను టెహ్రాన్ కు తరలించారు. టెహ్రాన్ మొత్తం సులేమాని కోసం నినదించింది. రోడ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. మహిళలు చిన్నారులు కూడా ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడుతో పాటు నాయకులు కూడా సులేమాని అంతిమయాత్రలో పాల్గొన్నారు.