English | Telugu

అలిగిన సీనియర్లు... సత్యవతి రాథోడ్ కి మంత్రి పదవి ఇవ్వడమే కారణం!

మహబూబాబాద్ జిల్లాలో వర్గపోరు రోజు రోజుకి రాజుకుంటుంది. మంత్రి సత్యవతి రాథోడ్ వర్సెస్ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్ మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. జిల్లా కేంద్రం లోనే మంత్రి సత్యవతి రాథోడ్ ఉంటారు. కానీ మిగితా ఇద్దరు ఎమ్మెల్యేలు ఆమెను కలువరు. తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పిలవరు.

తమ సీనియారిటీని పట్టించుకోకుండా జూనియర్ కు మంత్రి పదవి ఇచ్చారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు మంత్రి వర్గ విస్తరణ జరిగిన నాటి నుంచి మంత్రికి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలను కలుపుకొని పోవాలని మంత్రి ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్నారని జిల్లాలో చర్చ నడుస్తోంది. మంత్రి ఎమ్మెల్యేల మధ్య ఫైట్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుని సత్యవతి రాథోడ్ కు ఛాన్స్ ఇచ్చారు. అయితే జిల్లాలో తనకు సహకరించకపోవడంతో ఆమె అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే సత్యవతి సొంత జిల్లా మహబూబాబాద్ మంత్రిగా ఆమె తమ నియోజకవర్గంలో తిరిగితే భవిష్యత్ రాజకీయాల్లో తమకు ఇబ్బంది తప్పదని ఆలోచనతోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అనే అంశంపై కార్యకర్తల్లో చర్చసాగుతోంది.