English | Telugu

రాజధాని టీడీపీలో గ్రూపు రాజకీయాలు... బాబుకి బీపీ తెప్పిస్తున్న నేతల చర్యలు

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది కొందరు తెలుగుదేశం నేతల పరిస్థితి. ఒకవైపు పార్టీని బతికించుకోవడం కోసం చంద్రబాబు జిల్లాలు తిరుగుతూ, దీక్షలకు పిలుపునిస్తూ, ప్రభుత్వంపై ధాటిగా విమర్శలు చేస్తుంటే, కొందరు తమ్ముళ్లు మాత్రం, తమలో తాము కొట్టుకుంటూ, చంద్రబాబును మరింత విసుగెత్తిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నేతల మధ్య విభేదాలు చంద్రబాబుకి బీపీ పెంచుతున్నాయట. తాడికొండ నియోజకవర్గ నేతలైతే బాబుకి తలపోటు తెప్పిస్తున్నారట. ఆధిపత్య పోరుతో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయారట. అయితే, ఈ వివాదమంతటికీ మొన్నటి ఎన్నికల్లోనే బీజం పడిందంటున్నారు. అప్పటి తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు తాడికొండ టికెట్ ఇవ్వడం, అతను ఓడిపోవడంతోనే రగడ మొదలైందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. గతంలో తాడికొండ ప్రాతినిథ్యం వహించి, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ మళ్లీ ఈ నియోజకవర్గంపై కన్నేయడంతోనే గొడవ మొదలైందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా... మొన్నటి ఎన్నికల్లో తాడికొండ నుంచి బరిలోకి దిగాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, పలు సమీకరణలతో చంద్రబాబు.... శ్రవణ్ కుమార్ కు అవకాశమివ్వడంతో... సైలెంటైపోయారు. కానీ, శ్రవణ్ కుమార్ ఓడిపోవడంతో... మళ్లీ తన సొంత నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు డొక్కా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తాడికొండలో అనేకమంది టీడీపీ నేతలను రాజకీయంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించారన్న ఆరోపణలు డొక్కాపై ఉన్నాయి. ఇక, ఇఫ్పుడు టీడీపీలో గ్రూపు రాజకీయాలకు తెరతీశారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. తాడికొండ టీడీపీ ఇన్ ఛార్జ్ బాధ్యతలను దక్కించుకునేందుకు శ్రావణ్ కుమార్ వ్యతిరేక వర్గీయులతో జత కట్టారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తాడికొండలో శ్రావణ్ కుమార్ అసలు అందుబాటులో ఉండటం లేదనే ప్రచారం మొదలుపెట్టారట డొక్కా. తన వాదనను చంద్రబాబుతోపాటు నారా లోకేష్ దగ్గరకు తీసుకెళ్లి డొక్కా సక్సెస్ అయినట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి డొక్కా అయితేనే, తాడికొండలో గెలుపు సాధ్యమంటూ కేడర్ తోనూ చెప్పించినట్లు తెలుస్తోంది.

అయితే, డొక్కా చర్యలపై మండిపడుతోన్న శ్రావణ్ కుమార్... తన వాదనను అధినేత దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారంటూ డొక్కాపై ఫిర్యాదు చేశారట. ఒకవైపు డొక్కా... మరోవైపు శ్రావణ్ కుమార్... పరస్పర ఫిర్యాదులతో చంద్రబాబుకి తలబొప్పికడుతోందట. అసలు పార్టీ ఘోరంగా ఓడిపోయి కష్టాల్లో ఉంటే.... కలిసి పనిచేయాల్సిన నేతలు ఇలా కొట్టుకుంటూ... పార్టీకి మరింత నష్టం చేస్తున్నారంటూ మండిపడినట్లు తెలుస్తోంది. అయితే, డొక్కా, శ్రావణ్ ఆధిపత్య పోరుతో కేడర్ లో అయోమయం నెలకొందని, ఈ వివాదానికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. లేదంటే రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం కోలుకోవడం కష్టమేనంటున్నారు.