English | Telugu
ఆర్టీసీ కార్మికులకు నేను అండగా ఉంటా: పవన్ కళ్యాణ్
Updated : Nov 2, 2019
తెలంగాణ ఆర్టీసీ సమ్మె రోజు రోజుకి మరింత ఉధృతం అవుతూనే ఉంది. సమ్మె విషయంపై జేఏసీ లీడర్లు ఇప్పటికే గవర్నర్ ను కూడా కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. అందరి మద్దతు కూడగట్టుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ఇతర నేతలుతో పాటు పవన్ కళ్యాణ్ ని కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు.
‘‘తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంపై మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ గారిని.. కొందరు మంత్రులను.. నేను కలవడానికి సమయం కోసం జనసేన పార్టీ ప్రతినిధులు ప్రయత్నం చేశారు. అయితే ఆర్టీసి సమ్మె కార్మికుల గురించి చర్చించడానికి వారు ఎవ్వరూ సిద్ధంగా లేరు. అందువల్ల వారిని కలవలేకపోయాను. 3వ తేదీన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహణ భాగంగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండటంతో.. వచ్చిన తరువాత మరోసారి కేసీఆర్ గారిని కలవటానికి ప్రయత్నిస్తాను. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా నేను ఉంటాను’’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
కేసీఆర్పై తనకు అపారమైన గౌరవం ఉందని.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరించడం మంచిది కాదని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మెపై ఇవాళ ( నవంబర్ 2న ) తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రి వర్గాల నుంచి సమాచారం.