English | Telugu

భారత్-అమెరికా మధ్య రూ.21 వేల కోట్ల విలువైన ఒప్పందం!!

ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీలక చర్చలు జరిపారు. పలు ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేశారు. చర్చల అనంతరం.. ట్రంప్‌-మోదీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. తన భారత పర్యటన ఎంతో ప్రత్యేకమైనదని, ఈ పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. భారత్-అమెరికా మధ్య రూ.21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. భారత్ కు అత్యంత అధునాతనమైన అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అందజేయనున్నామని తెలిపారు.

ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలకమైన ఒప్పందాలపై అవగాహనకు వచ్చామని ట్రంప్ చెప్పారు. 5జీ వైర్ లెస్ నెట్ వర్క్ పై చర్చించామని తెలిపారు. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలపై చర్చించామన్నారు. భారత్ కు పెద్ద మొత్తంలో సహజ వాయువు (ఎల్ఎన్ జీ) సరఫరాకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి ఇరు దేశాల పౌరులకు భద్రత కల్పించుకునే విషయంపైనా చర్చించామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ట్రంప్ చెప్పారు.

అనంతరం మోదీ మాట్లాడుతూ.. ట్రంప్‌కు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్‌ సతీసమేతంగా భారత్‌ రావడం ఆనందం కలిగించిందని, గత 8 నెలల్లో తానూ, ట్రంప్‌ 8 సార్లు సమావేశమయ్యామని గుర్తుచేశారు. అమెరికా-భారత్‌ మధ్య స్నేహ బంధం పెరిగిందని, ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. రక్షణ, భద్రత, ఐటీ వంటి అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు.