English | Telugu

ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదు!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, రాష్ట్రపతి భవన్ లో ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు కేరళ, ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం అందకపోవడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై తాజాగా మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు ఆరోపించారు.

చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో ఈరోజు చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, వైసీపీ హయాంలో అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. జగన్ సైకో లాగా మారిపోయారన్నారు. తనపై కక్షతో కుప్పంకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారన్నారు. అమరావతి, అభివృద్ధి కోసం యువత పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.