English | Telugu

త్వరలో హైదరాబాద్ మెట్రో పరుగులు.. సిటీ బస్సులు మాత్రం..

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్-4 లో భాగంగా అనేక సడలింపులు ఇస్తూ మెట్రో రైళ్లను నడిపే విషయంలో మాత్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో ఈ నెల 7 నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నగరంలోని సామాన్యులకు అందుబాటులో ఉండే సిటీ బస్సుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సిటీ బస్సులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి సంకేతాలు అందలేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయం మరోలా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెట్రో రైళ్లలో అయితే ప్రయాణికులను నియంత్రించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ వంటి నిబంధనలను పాటించేందుకు అవకాశం ఉంటుందని.. అదే సిటీ బస్సుల విషయంలో ప్రయాణికులను నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికి కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్న నేపథ్యంలో సిటీ బస్సులు నడిపితే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సిటీ బస్సుల విషయంలో మాత్రం మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.