English | Telugu

హైదరాబాద్ మెట్రో రైల్ మరో రికార్డు... దేశంలో రెండో స్థానం...

హైదరాబాద్ మెట్రో రైల్ మరో ఘనతను సాధించింది. ఢిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో రైల్ గా అవతరించింది. అయితే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన మొట్టమొదటి అతిపెద్ద ప్రాజెక్టుగా వరల్డ్ రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైల్ లో మరో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే, నాగోల్ టు రాయదుర్గం.... ఎల్బీనగర్ టు మియాపూర్ రూట్స్ లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, ఇప్పుడు కొత్తగా జేబీఎస్ టు ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. కారిడార్-3గా పిలిచే ఈ మార్గంలో 11 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు తిరగనున్నాయి. దాంతో, మొత్తం 68 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.

అయితే, హైదరాబాద్లో అతిపెద్ద బస్ స్టేషన్లయిన జేబీఎస్ అండ్ ఎంజీబీఎస్ మధ్య మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడే అవకాశం నగర వాసులకు లభించింది. ఎందుకంటే, ట్రాఫిక్ రద్దీ కారణంగా దాదాపు గంట సమయం పట్టే ఈ మార్గంలో కేవలం పదిహేను నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చు. జూబ్లీ బస్ స్టేషన్... మహాత్మాగాంధీ బస్ స్టేషన్ల నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు... అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లకు ఈ మెట్రో రైల్ మార్గం ఎంతో ఉపయోగకరం కానుంది.

మొత్తానికి, భాగ్యనగరానికే తలమానికంగా మారిన హైదరాబాద్ మెట్రోరైల్ అతి తక్కువ సమయంలోనే గ్రేటర్ ప్రజల మనసును దోచుకుంటోంది. ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు నగరవాసులంతా మెట్రోను ఆశ్రయిస్తుండటంతో రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది.