English | Telugu

హైదరాబాద్ బ్యాచిలర్స్ రోడ్డున ప‌డ్డారు!

లాక్‌డౌన్‌తో ప్రైవేట్ హాస్టల్స్‌లో ఉంటున్న బ్యాచిలర్స్ రోడ్డున ప‌డ్డారు. హాస్టల్స్‌లో ఉండే ప‌రిస్థితి లేదు. అలా అని సొంత ఊళ్లకు వెళ్లలేక పోలీస్ స్టేషన్లను ఆశ్రయించి త‌మ గోడు వెళ్ల‌బోసుకుంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు పెడ్తున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌రకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కాబ‌ట్టి త‌మ సంగ‌తేందో తేల్చ‌మ‌ని పోలీసుల‌కు చిరాకుపుట్టిస్తున్నార‌ట‌.

నిన్న రాత్రి నుంచి నిబంధ‌న‌ల్ని గ‌ట్టిగా అమ‌లుచేయ‌డంతో తిన‌డానికి ఏమీ దొర‌క‌క పాపం అల్లాడి పోతున్నార‌ట‌. ఏం చేయాలో తోచ‌క పొట్ట‌చేత‌ప‌ట్టుకొని అన్న‌మో రామ‌చంద్ర అంటూ బ్యాచిలర్స్ రోడెక్కారు.

దాదాపు అన్ని హాస్టల్స్ మూసివేశారు. అయినా ఖాళీ చేయ‌కుండా వున్న వారిని నిర్వాహ‌కులు గ‌ట్టిగానే త‌రిమివేస్తున్నారు. దీంతో యువతి, యువకులు తీవ్ర అసౌక‌ర్యానికి గురౌతూ ఇబ్బందులు పడుతున్నారు. అటు హాస్టల్స్‌లో ఉండటానికి వీల్లేక.. ఇటు సొంత ఊళ్లకు వెళ్లలేక రోడ్డుపై నిలబడ్డారు. వారంతా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు. తాము సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చబౌలి ప్రాంతాల్లో రోడ్ల మీద ఎవ‌రిని అడిగినా ఇదే చెబుతున్నారు. పోలీసులు కూడా ఈ సమస్యపై గందరగోళంలో ప‌డ్డారు. వీరిని సొంత ఊర్లకు ఎలా పంపించాలనే అంశంపై ఫోకస్ పెట్టారు.. అధికారులతో చర్చిస్తున్నారు. యువతీ, యువకులకు ఒక్కసారి ప్రయాణం చేసేలా పాస్‌లు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. పాస్ ఇచ్చినా వారు ఊర్లకు ఎలా వెళ్తార‌నేది అర్ధంకాక అయోమయంలో ఉన్నారు.