English | Telugu
స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Updated : Oct 8, 2020
న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై మీడియా, సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ వ్యాఖ్యలపై విచారణ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్‌లు చేస్తున్నారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలపై.. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీఐడీ విఫలమైతే సీబీఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సీబీఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
స్పీకర్ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారా? బయట చేశారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించగా.. తిరుపతి కొండపై మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ ఆ వ్యాఖ్యలు చేశారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది తెలియజేశారు. ఇదంతా చూస్తుంటే న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం నిలబడాలంటే కోర్టులు అవసరమన్న ధర్మాసనం.. న్యాయస్థానాలు, ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేసుకోవాలని పేర్కొంది.