English | Telugu

2021 నాటికి 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి!!

కరోనా మహమ్మారి దెబ్బకి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఎందరో జీవితాలు తలకిందులయ్యాయి. అయితే ఈ మహమ్మారి ప్రభావం భవిష్యత్తుపై తీవ్రంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోతారని హెచ్చరించింది.

కరోనా వైరస్‌ ప్రపంచానికి సవాలు విసురుతోందని, ఈ ఒక్క ఏడాదే కొత్తగా 8 నుంచి 11 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోయే ప్రమాదముందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. 2021 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కరలేదని పేర్కొంది. ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రపంచంలో పేదరికం మరింత పెరిగనుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు 1.4 శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని తెలిపింది. ఇప్పటికే పేదరికంలో మగ్గిపోతున్న దేశాలకు రాబోయే రోజులు మరింత కష్టాలను కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాక్సిన్ వస్తే పరిస్థితి మాములుగా మారిపోతుందని అనుకుంటున్నారని.. కానీ, కరోనా తరువాత ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలిపింది.

కాగా, భారత్‌ లో పేదరికంపై ప్రపంచ బ్యాంక్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పేదరికం విషయంలో భారత్‌ కు సంబంధించిన సమాచారం లేకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. నిరుపేదలు ఎక్కువగా ఉండే భారత్‌ లో ఈ సమాచారం లేకపోవడం కారణంగానే ప్రస్తుత ప్రపంచ పేదరికాన్ని అంచనా వేయలేకపోతున్నామని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. అయితే, ముంబైలోని ధారావి మురికివాడలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు విశేష కృషి ప్రపంచ బ్యాంక్‌ ప్రశసించింది.