ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తి తో ఒకపక్క ఉలిక్కి పడుటోంది. మరో పక్క తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి అసమాన సేవలకు గుర్తుగా వారి పై పూల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా గాంధీ, నిమ్స్, ఉస్మానియా హాస్పిటల్స్‌లో పలువురు వైద్య విద్యార్థులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. దీని పై స్పందించిన హైకోర్టు వైద్య సిబ్బందికి అసలు కరోనా ఏలా వచ్చింది? వారికి రక్షణ కోసం పిపియి కిట్లు ఇచ్చారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన పలు అంశాలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో వైద్యులకు రక్షణ కిట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ న్యాయవాది ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అసలు వైద్య సిబ్బందికి కరోనా ఎలా సోకిందో ఈనెల 8వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్నీ ఆదేశించింది.