English | Telugu

హైదరాబాద్ ను పక్కన పెట్టి టెన్త్ పరీక్షలు జరుపుకోండి: హైకోర్టు

ఇండియాలో కరోనా ఎంటర్ కావడం తో దేశం మొత్తం మార్చ్ 23 నుండి లాక్ డౌన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి కాకుండానే పాఠశాలలకు సెలవులు ప్రకటించడం తో 10 వ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఐతే తాజాగా లాక్ డౌన్ లో సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ లో ఈ నెలలోనే 10 వ తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యం లో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కొంత మంది తల్లితండ్రులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని పై ఈ రోజు జరిగిన విచారణ లో కోర్టు ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించింది. రంగారెడ్డి, జీహెచ్ఎంసి పరిధిలో కరోనా కేసులు ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకున్నామని.. అందువల్ల ఇక్కడ కూడా రాష్ట్రం తో పాటు టెన్త్ పరీక్షలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును అనుమతి కోరింది. ఐతే హైదరాబాద్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్క విద్యార్ధి అయినా కరొనతో మరణిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ లోగా పరీక్షా కేంద్రాలుగా ప్రకటించిన ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా మారితే అప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించింది. జీహెచ్ఎంసి పరిధిలో కరోనా తీవ్రత దృష్ట్యా అక్కడ పరీక్షలకు పర్మిషన్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఐతే జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ద్వారా అనుమతించాలని ఐతే వారిని కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది.