English | Telugu

హైదరాబాద్‌లో అర్ధరాత్రి అతలాకుతలం... వరుసగా మూడోరోజూ దంచికొట్టింది...

వరుసగా మూడోరోజు కూడా హైదరాబాద్‌‌లో వర్షం దంచికొట్టింది. మొదటి రెండ్రోజులూ మధ్యాహ్నం, సాయంత్రంవేళ వర్షం దండికొడితే, మూడోరోజు మాత్రం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో విరుచుకుపడింది. అందరూ నిద్రలోకి జారుకున్నాక, అర్ధరాత్రి భారీ శబ్ధాలతో వరుణుడు విరుచుకుపడ్డాడు. గంటల తరబడి కురిసిన జోరువానకు ఎప్పటిలాగే, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం వణికిపోతోంది. గ్యాప్ లేకుండా దంచికొడుతున్న వానలకు భాగ్యనగరం అతలాకుతలమవుతోంది. వరుసగా మూడోరోజు కూడా కుండపోత వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎప్పటిలాగే, రోడ్లన్నీ వాగుల్లా, కాలనీలు చెరువుల్లా మారగా, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఇక పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో, మరో రెండ్రోజులపాటు ఇదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణశాఖ హెచ్చరించింది.