English | Telugu

జగన్ మరో సంచలన నిర్ణయం... వరుసగా ఆరు జీవోలు జారీ

ఏళ్ల తరబడి సాగుతోన్న గిరిజనుల పోరాటాలకు, ఆదివాసీల ఉద్యమాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ జగన్ సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను శాశ్వతంగా నిలిపేస్తూ జీవో ఇచ్చింది. బాక్సైట్‌ తవ్వకాల కోసం 15వందల హెక్టార్లలో 30ఏళ్లపాటు ఏపీఎండీసీకి ఇచ్చిన లీజును రద్దు చేసింది. వరుసగా మొత్తం 6జీవోలను జారీ చేసింది.

విశాఖ జిల్లా అరకు, అనంతగిరి మండలాల పరిధిలో జెర్రెల, గాలికొండ, రక్తకొండ ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాల కోసం గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. అడవులు, కొండలను తవ్వడం వల్ల తమ జీవితాలు నాశనమవుతున్నాయంటూ 50ఏళ్లుగా గిరిజనులు, ఆదివాసీలు పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు జరిగినప్పుడెల్లా గిరిజనులు, ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మావోయిస్టులు సైతం అడవి బిడ్డల పోరాటాలకు మద్దతిచ్చారు. అయితే, పాదయాత్ర సమయంలో... తాము అధికారంలోకొస్తే బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేస్తామంటూ హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి... ఇచ్చిన మాట మేరకు బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీ గ్రామాలు, అడవుల్లో బాక్సైట్ తవ్వకాలను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.