English | Telugu

గుంటూరు కలెక్టర్‍, ఎస్పీపై ఇంటిలిజెన్స్ నివేదిక‌!

గుంటూరు జిల్లా కలెక్టరు, ఇంఛార్జి ఎస్పీ, మునిసిపల్‍ కమీషన్‍, డిహెచ్‍ఎంవో ప్రచార అర్భాటానికే ప్రాదాన్యత ఇస్తున్నారు త‌ప్ప గ్రౌండ్ లెవెల్‌లో కరోనా బారిన పడ్డ వారిని గుర్తించటంలో ఘోరంగా విఫలమయ్యారు. గుంటూరు నగర పోలీసు విభాగంలో అడిషనల్‍ ఎస్పీ స్థాయి నుండి క్రింది స్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు సక్రమంగా పని చేస్తున్నప్పటికీ.. కరోనా బాధితుల వివరాలను సేకరించటంలో హోం శాఖేతర అధికారులు సకాలంలో స్పందించలేకపోవటంతో.. తాజా పరిస్థితికి కారణమయ్యారని ఇంటిలిజెన్స్ ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింద‌ట‌.

గుంటూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. జిల్లా కలెక్టర్‍ శామ్యూల్‍ ఆనంద్‍ కుమార్‍, గుంటూరు అర్బన్‍ ఎస్పీ రామకృష్ణలు నిర్లక్ష్య వైఖరి వల్లే జిల్లాలో ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఇంటిలిజెన్స్ ప్ర‌భుత్వానికి తెలిపింద‌ట‌. వారిద్దరూ సకాలంలో స్పందించకపోవటమే తాజా పరిస్థితికి కారణమని.. ఇంటిలిజెన్స్ విభాగం నివేదిక ద్వారా సిఎంకు తెలియజేయటంతో.. వారిద్దరినీ బాధ్యతల నుండి తప్పిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాజకీయ అధికార వర్గాల సిఫార్సులకు తలొగ్గే మనస్తత్వం ఉన్న శామ్యూల్‍ ఎప్పుడో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పటికీ తీసుకోవటం లేదని.. గుంటూరులో కరోనా బాధితుల వివరాలు సేకరించటంలో.. పోలీసు వ్యవస్థను పని చేయించటంలో.. అర్బన్‍ విభాగం ఇంఛార్జి ఎస్పీ రామకృష్ణ, మెతకవైఖరి అవలంబించారని.. ఆయనను కూడా బాధ్యతల నుండి తప్పించే అవకాశాలున్నాయట‌.

గుంటూరు మునిసిపల్‍ కమీషనర్‍ అనురాధతో పాటు జిల్లా మెడికల్‍ అధికారి కూడా కరోనా వ్యాథి బాధితులను గుర్తించటంలో.. నిర్లక్ష్య వైఖరి అవలంబించారని, వారిద్దరిని కూడా తప్పించాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.

ఈ సమయంలో వారిని బదిలీచేస్తే. కొత్త సమస్యలు ఎదురు కావచ్చునని వారి స్థానంలో నియమితులైన వారికి పరిస్థితులు అవగాహన చేసుకోవాలంటే.. 10 రోజులు సమయం పడుతుందని.. తాజా పరిస్థితులు చల్లబడ్డాక తప్పిస్తే.. మంచిదని సిఎంవో అధికారులు కూడా భావిస్తున్నట్లు తెలిసింది.