English | Telugu

ఏపిలో మ‌రో ఎయిర్‌పోర్ట్! జీఎంఆర్ కు అవ‌కాశం!

ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కానుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో 2019 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్‌కు వేసిన బిడ్డర్లలో హైయ్యస్ట్ బిడ్డర్‌గా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిలిచింది. ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసేందుకు, ఆపరేషన్స్ నిర్వహించేందుకు తమ సబ్సిడరీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్(జీఏఎల్)కు అవకాశం దక్కినట్టు జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రకటించింది.

గత ఐదేళ్ల నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసెంజర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. అంతేకాక కార్గో ట్రాఫిక్‌ కూడా బాగా పెరుగుతోంది. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసెంజర్ ట్రాఫిక్‌ గత ఐదేళ్లలో సీఏజీఆర్ 21 శాతం నమోదు కాగా.. కార్గో ట్రాఫిక్ విషయంలో ఇండియాలో కస్టమ్స్ ఎయిర్‌పోర్ట్‌ల్లో వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఐదో స్థానంలో నిలిచింది.

ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వైజాగ్, విజయనగరం జిల్లాలకు సరిహద్దుల్లో ఉంది. ఎన్‌హెచ్ 5 ద్వారా వైజాగ్‌ నుంచి 45 కిలోమీటర్లు, ఎన్‌హెచ్ 43 ద్వారా విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ అవార్డు(ఎల్‌ఓఏ) దక్కించుకున్నట్టు సంస్థ వెల్లడించింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ విషయాన్ని తెలిపింది. తాజా ప్రాజెక్ట్‌లో భాగంగా 40 ఏళ్ల వరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ డిజైన్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్, డెవలప్‌మెంట్, అప్‌గ్రేడెషన్, ఆపరేషన్, మెయింటనెన్స్ వంటి వన్నీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్సే చూసుకోనుంది. ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా మరో 20 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్ట్‌ను పొడిగించుకోవచ్చు. 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను డెవలప్‌, ఆపరేట్, మేనేజ్ చేసే అవకాశం మాకు దక్కడం గర్వకారణం' అని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు చెప్పారు.