English | Telugu

భారత్‌లో పత్రికా స్వేచ్ఛ లేదు!

భార‌త‌దేశంలో జర్నలిస్టులపై వేధింపుల్లో అవమానాలు, అత్యాచారాలు, హత్య బెదిరింపులు పెరిగిపోయాయి. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఈ ఏడాది అత్యంత అధ్వాన్నమైన దేశాల జాబితాలో భారత్‌ చేరిపోయింది. అంతర్జాతీయ మీడియా పర్యవేక్షణా సంస్థ 'రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌' (ఆర్‌ఎస్‌ఎఫ్‌) విడుదల చేసిన జాబితాలో భారత్‌ కూడా చేరింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్రమైన ప్రమాదం ఏర్ప‌డిందని ఆర్ ఎస్ ఎఫ్ ఆందోల‌న వ్య‌క్తం చేసింది.

భారతదేశంలో జర్నలిస్టులపై వేధింపుల్లో సామాజిక మీడియా సాక్షిగా జరిగే అవమానాలు, అత్యాచారాలు, హత్య బెదిరింపులు వంటివి వున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది. ఇటువంటి వేధింపులకు ఇద్దరు భారత జర్నలిస్టులు రాణా అయూబ్‌, స్వాతి చతుర్వేదిలను ఉదాహరణగా పేర్కొనవచ్చని తెలిపింది. 2002 గుజరాత్‌ అల్లర్లపై అయూబ్‌ పుస్తకం రాశారు. ఈ సందర్భంగా తనకు అనుభవంలోకి వచ్చిన ఆన్‌లైన్‌ వేధింపులను న్యూయార్క్‌ టైమ్స్‌లో రాసిన వ్యాసంలో వివరించారు. ఆమెకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో విద్వేష ప్రచారం కొనసాగుతున్న దృష్ట్యా రక్షణ కల్పించాలని యుఎన్‌హెచ్‌ఆర్‌సి నిపుణులు భారత ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు స్వాతి చతుర్వేది 'ఐ యామ్‌ ఎ ట్రోల్‌'-ఇన్‌సైడ్‌ ది సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ బిజెపి డిజిటల్‌ ఆర్మీ పేరుతో రాసిన పుస్తకానికి ఆర్‌ఎస్‌ఎఫ్‌ అవార్డు కూడా లభించింది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ చతుర్వేది రాసినందుకు ఆమెకు సోషల్‌ మీడియాలో బెదిరింపులు ఎదురవుతున్నాయని ఐరాస ప్రత్యేకాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇకపోతే జమ్మూ కాశ్మీర్‌లో ప్రజలకు ఇంటర్‌నెట్‌ను అందుబాటులో లేకుండా చేయడం ద్వారా భారత ప్రభుత్వం ప్రభుత్వ సెన్సార్‌షిప్‌కు పాల్పడిందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది.

2019లో 121సార్లు ఇంటర్‌నెట్‌ను ఆపివేసిన దేశం భారత్‌ అని వ్యాఖ్యానించింది. భారత్‌లోని ఆర్‌ఎస్‌ఎఫ్‌ విలేకరితో సహా భారత విలేకర్లపై ఇజ్రాయిల్‌లో ఎన్‌ఎస్‌ఓ గ్రూపు గూఢచర్యం జరిపిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో 14శాతం ట్వీట్లు భారత మహిళా రాజకీయవేత్తలను దూషిస్తూ వచ్చాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా పేర్కొంది.

ప్రైవేటు రంగ కంపెనీలు, అసంఘటిత రంగ సంస్థలు తమకు వున్న అధికారాలతో ఇన్వెస్టిగేటివ్‌ విలేకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నాయ‌ని పారిస్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ పర్యవేక్షణా సంస్థ పేర్కొంది.