English | Telugu
'సైకిల్' దిగి, ఫ్యాన్ అందుకోబోతున్న మాజీ ఐఏఎస్ రామాంజనేయులు
Updated : Mar 18, 2020
మాజీ పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు త్వరలో వై ఎస్ ఆర్ సి పి తీర్థం పుచ్చుకోబోతున్నారు. చంద్రబాబు నాయుడు కు అత్యున్నత సన్నిహితుడైన ఈ మాజీ ఐ ఏ ఎస్ అధికారి, కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీకి టీ డీ పి టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన రామాంజనేయులు, వై ఎస్ ఆర్ సి పి లో చేరటానికి కారణం, ఆయన బంధువు శమంతకమణి ఇప్పటికే వై ఎస్ ఆర్ సి పి లో చేరటానికి నిర్ణయం తీసుకోవటమే అని తెలిసింది. రామాంజనేయులు తీసుకున్న ఈ నిర్ణయం టీ డీ పి ని కలవరపెడుతోంది. ప్రత్యేకించి , టీ డీ పి ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లో-- ఆర్ధిక పరమైన అంశాల్లో జరిగిన అవకతవకలపై రామాంజనేయులు దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ ఉందనీ, ఆ విషయాలు అయన బయటపెడితే, అప్పటి సలహాదార్లులలో ముఖ్యులైన కుటుంబ రావు కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఇందుకోసమే, వై ఎస్ ఆర్ సి పి ముఖ్యులు ఆయనతో టచ్ లో ఉన్నారనీ, బహుశా రామాంజనేయులు కూడారెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చునని తెలుస్తోంది.
సామాన్య ప్రజలకు సైతం అందుబాటు లో ఉండే ఐ ఎ ఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న రామాంజనేయులు, పంచాయతీరాజ్ కమిషనర్ గా పని చేస్తున్న సమయంలో కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. అయినా సరే, ఆయన మీద నమ్మకముంచిన చంద్రబాబు నాయుడు ఆయనకు పదవే విరమణ తర్వాత , ఎక్స్-అఫిషియో సెక్రెటరీ హోదా కల్పిస్తూ -ఐ అండ్ పీ ఆర్ విభాగాన్ని అప్ప చెప్పారు. ఆ తర్వాత, టీ డీ పి టికెట్ పై తాడికొండ నుంచి పోటీ చేయించాలని భావించారు. కానీ, చివరకు కర్నూల్ జిల్లా నుంచి పోటీ చేయించారు. టీ డీ పి ఓటమి తర్వాత కొంతకాలం గా ఆయన ఒక ప్రయివేట్ ఐ ఏ ఎస్ స్టడీ సర్కిల్ బాధ్యతలను ప్రత్యక్షం గా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. దళితుడైన రామాంజనేయులు, తమ పార్టీ లో చేరితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లో అవకతవకలకు సంబంధించిన సమగ్ర సమాచారం తమకు లభ్యమవుతుందనే విశ్వాసం తో వై ఎస్ ఆర్ సి పి నాయకత్వం ఉన్నట్టు సమాచారం. రక రకాల అంశాలతో రోజు వారీ తమను ఇబ్బంది పెడుతున్న తెలుగుదేశాన్ని, విధాన పరమైన అంశాల్లో ఇరుకున పెట్టాలంటే... రామాంజనేయులు వంటి వారి సేవలు పార్టీకి అవసరమనే భావన లో వై ఎస్ ఆర్ సి పి నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి, తెలుగుదేశం హయం లో ప్లానింగ్ బోర్డుకు సేవలందించిన కుటుంబరావు లాంటి వారి లొసుగులన్నీ రామాంజనేయులు చేతిలో ఉండటం తో, ఇది ఒక అడ్వాంటేజ్ గా మారుతుందని వై ఎస్ ఆర్ సి పి భావిస్తోంది.