English | Telugu
కరోనా వాక్సిన్ పై బ్రిటన్ ప్రత్యేక అధికారి సెన్సేషనల్ కామెంట్స్
Updated : Oct 28, 2020
"అసలు మనకు ఎప్పటికైనా కరోనా వాక్సిన్ అందుబాటులోకి వస్తుందా రాదా అనే దానిపై చాలా సందేహాలున్నాయి. అందుకే.. మనం అంతాబాగానే ఉంటుందిలే అనే అలోచన ధోరణితో కాకుండా జాగ్రత్త పడాలి. అతివిశ్వాసానికి దూరంగా ఉండాలి" అంటూ కేట్ బింగమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "తొలి తరం వ్యాక్సిన్లు కరోనా నుంచి పూర్తి రక్షణను ఇవ్వలేకపోవచ్చు. అసలు కరోనా సోకకుండా ఆపలేకపోవచ్చు. ఇవి కేవలం వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గించవచ్చు. ఇది కూడా ప్రతి ఒక్కరి విషయంలో నిజం కాకపోవచ్చు. అయితే మనం ఆశిస్తున్న సుదీర్ఘ రక్షణను మాత్రం ఇవ్వలేకపోవచ్చు. ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం సిద్ధంగా ఉండాలి" అని ఆమె తెలిపారు.
అంతేకాకుండా.. మొదటి తరం వాక్సిన్లలో చాలావరకు విఫలం కూడా కావచ్చని, ఒకవేళ అన్నీ విఫలమైనా ఆశ్చర్య పోవద్దని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే 65 ఏళ్లు పైబడిన వారికి రక్షణ కల్పించే వాక్సిన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆమె అన్నారు. ఇదే సమయంలో ప్రపంచానికి కోట్ల సంఖ్యలో కరోనా డోసుల అవసరం ఉందని, కానీ..ప్రస్తుతమున్న వాక్సిన్ తయారీ సామర్థ్యం ప్రపంచ జనాభాకు అసలేమాత్రం సరిపోదని ఆమె తేల్చి చెప్పారు. బ్రిటన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు.
ఇది ఇలా ఉండగా.. ఇంపీరియల్ కాలేజ్ లండన్ సైన్టిస్టులు నిన్న ఒక కీలక అధ్యయానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కరోనా నుండి కోలుకున్న వారిపై జరిగిన పరిశోధనలో.. కరోనా నుంచి రక్షించే యాంటీబాడీల సంఖ్య బ్రిటన్ ప్రజల్లో క్రమంగా తగ్గుతోందని, వారిలో ఈ నిరోధక శక్తి తక్కువ కాలం పాటు మాత్రమే ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీంతో సమాజంలో కరోనా రోగనిరోధశక్తి వేగంగా తగ్గిపోవచ్చనే ఆందోళన అక్కడి ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోపక్క రెండో సారి కరోనా దాడిచేయచ్చనే అంచనాతో బ్రిటన్ ప్రభుత్వం సిద్ధం అవుతోందని వార్తలు వస్తున్నాయి.