English | Telugu
ఏపీలోని కరోనా క్వారంటైన్ సెంటర్లో అగ్నిప్రమాదం..
Updated : Aug 25, 2020
ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మరణించిన ఘటన మరవక ముందే రాష్ట్రంలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని కొమ్మాది లో ఉన్న శ్రీ చైతన్య వాల్మీకి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కంప్యూటర్‌లు, ఇతర ఫర్నిచర్ దగ్ధమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది కరోనా బాధితులను మరో చోటికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారెవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇది ఇలా ఉండగా ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఆ ఘటనపై ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీని పై ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా విశాఖలోని క్వారంటైన్ సెంటర్లో ప్రమాదం జరగడంతో తీవ్ర కలకలం రేగింది.