English | Telugu

రైతుని లారీతో తొక్కించి చంపిన ఇసుక మాఫియా

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ పొలాల నుంచి ఇసుక లారీలను తీసుకెళ్లొద్దు.. పొలాలు ఆగమై పోతున్నాయని ఇసుక లారీని అడ్డుకున్న రైతును అదే లారీతో తొక్కించి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన రాజాపూర్ మండలం తీర్మాలపూర్‌లో జరిగింది.

గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలంలో నుంచి ఇసుక రవాణా చేసేందుకు యత్నించగా.. గ్రామానికి చెందిన గుర్రం కాడి నరసింహులు(38) అనే రైతు అడ్డుకునేందుకు యత్నించాడు. తన వ్యవసాయు పొలం నుంచి ఇసుక అక్రమ రవాణా చేయవద్దని.. అసలే గత మూడేళ్లుగా వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని నరసింహులు వేడుకున్నాడు. అయినా ఇసుక మాఫియా కనికరం చూపకుండా దౌర్జన్యానికి దిగడమే కాకుండా నరసింహులును లారీతో గుద్ది హతమార్చింది. .

గత ఏడాది కూడా అదే గ్రామంలో ఒక రైతుని అడ్డు వచ్చాడనే నెపంతో ఇసుక మాఫియా హత్య చేసినట్టు తెలిసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయని, హత్యలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఒక ప్రజా ప్రతినిధితో ఇసుక మాఫియా సెటిల్ మెంట్ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ మృతదేహంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు.