English | Telugu

కేంద్ర ప్రభుత్వ కొత్త పాలసీతో జగన్ సర్కార్ కు దెబ్బ 

కేంద్ర ప్రభుత్వం నిన్న కొత్త విద్యావిధానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 34 సంవత్సరాల తర్వాత మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 5వ తరగతి వరకు విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని కేంద్రం నిర్ణయించింది. వీలయితే 8వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని చెప్పింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయానికి విఘాతం కలిగే అవకాశం ఉంది.

కేంద్రం తాజాగా తెచ్చిన జాతీయ విద్యావిధానాన్ని ఏపీ ప్రభుత్వం కూడా పాటించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనే జగన్ నిర్ణయానికి అది విఘాతం కలిగిస్తుందని వారు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 81,85 జీవోలను హైకోర్టు కొద్దీ రోజుల క్రితం కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో హైకోర్టు తీర్పు పై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అంతే కాకుండా రాష్ట్రంలోని 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియాన్ని కోరుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త పాలసీ తో జగన్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో వేచి చూడాలి.