English | Telugu

ప్లాస్మా దానం పేరుతొ వందల మందిని మోసం చేసిన ప్రబుద్దుడు

కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. ఈ పరిస్థితుల్లో కరోనా ట్రీట్మెంట్ కు అత్యవసరమైన మందులను కొంత మంది బ్లాక్ మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటుండగా, మరి కొంత మంది ప్లాస్మా దాతలుగా అవతారం ఎత్తి కరోనా బాధితులను, వారి బంధువులను పీల్చిన పిప్పి చేస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్మా డొనేషన్ పేరుతొ ఏకంగా 200 మందిని మోసం చేసిన ఒక యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. శ్రీకాకుళం జిల్లా పోనుగూటివలసకు చెందిన రెడ్డి సందీప్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నం విఫలం కావడంతో దొంగతనాలు మొదలు పెట్టాడు. విశాఖపట్టణంలోని ఫ్లూ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన అతడు కరోనా కారణంగా రోగులకు ప్లాస్మా అవసరాన్ని గుర్తించాడు. దీనిని అవకాశంగా మార్చుకుని సందీప్ ప్లాస్మా డోనర్ పేరుతో మోసాలు చేయడమా మొదలు పెట్టాడు. ప్లాస్మా దాతల కోసం సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రకటనలు చూసి వారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి తాను ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నానని, తన బ్లడ్ గ్రూప్ కూడా మీకు కావాల్సిన బ్లడ్ గ్రూపేనంటూ నమ్మించేవాడు. తాను శ్రీకాకుళం నుంచి వచ్చి వెళ్లేందుకు రవాణా, ఇతర ఖర్చుల కోసం కొంత డబ్బు కావాలని కోరేవాడు. దీంతో బాధితులు, వారి బంధువులు నమ్మి అతడి అకౌంట్ లో డబ్బులు వేసిన వెంటనే తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. సందీప్ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 200 మందిని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే అతడి చేతిలో మోసపోయిన హైదరాబాద్‌కు చెందిన కొంత మంది బాధితులు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలోను ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని నిన్న అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. అయినా కొంతమంది ఇంతేనేమో.. ఒక పక్క ప్రజలు ప్రాణాల మీదకు వచ్చి అవస్థలు పడుతుంటే ఇటువంటి వారు దానిని కూడా సొమ్ము చేసుకునే నికృష్టమైన పనిలో ఉంటున్నారు.