English | Telugu

అమరావతిని ముంచే కుట్ర? జగన్ సర్కార్ పై రైతుల ఆగ్రహం 

వరదలతోనూ ఏపీలో రాజకీయం చేస్తున్నారా? సొంత ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారా? అమరావతిని ముంచేందుకు ప్లాన్ చేశారా? ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వర్గాల నుంచి ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. అమరావతిని రాజధానిగా అంగీకరించని జగన్ సర్కార్.. ఆ ప్రాంతాన్ని ముంపుగా చూపించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని గ్రామాల్లోకి వరద రావాలనే ఉద్దేశ్యంతోనే.. అక్కడి వాగుల పూడిక తీత చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్యాముల నుంచి సకాలంలో నీటిని వదలకుండా, ఎత్తిపోతల మోటార్లు వేయకుండా కావాలనే కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారు. వందేళ్లలో రాని ముంపు అమరావతికి వస్తే అందుకు జగన్ ప్రభుత్వమే కారణమంటున్నారు రాజధాని రైతులు,

వైసీపీ నేతల తీరు కూడా రాజధాని రైతుల అనుమానాలకు బలమిచ్చేలా ఉన్నాయి. వరదలతో అమరావతి మునిగిపోయిందని, రోడ్ల మీద చేపలు పట్టుకోవచ్చు అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోతుందని హడావిడి చేశారు. ఏపీ హైకోర్టును వరద ముంచెత్తిందని కొందరు పోస్టులు పెట్టారు. అయితే సోషల్ మీడియా ప్రచారం జరిగినట్లు అమరావతి ఎక్కడా నీట మునగలేదు. హైకోర్టు దరిదాపుల్లోకి కూడా వరద రాలేదు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా భద్రంగానే ఉంది. పరువు పోగొట్టుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమరావతికి పెద్దగా వరద ముంపు లేదు. అమరావతిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వైసీపీ నేతలే ఫేక్ ఫోటోలు పెట్టి ప్రచారం చేశారు. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాన్ని పట్టుకుని కొందరు వైసీపీ ముఖ్య నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పరువు పొగొట్టుకున్నారు.

తమ కుట్రలో భాగంగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు ముందుకు పోతున్నారని రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అమరావతి ప్రాంతం వరదలో మునిగేలా జగన్ ప్రభుత్వ చర్యలు ఉండగా.. అసత్య ప్రచారాలతో బద్నాం చేేసే పనిలో వైసీపీ కేడర్ ఉందని చెబుతున్నారు. అమరావతి ముంపునకు గురవుతుందని ప్రభుత్వం చేస్తోన్న విష ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని రైతులు సూచిస్తున్నారు. దమ్ముంటే అమరావతి రాజధానిపై బహిరంగ చర్చకు వస్తారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మహా నగరాలు మునుగుతున్నా అమరావతి సేఫ్ గా ఉందని చెప్పారు. విపత్తులో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వానికి ముంచడమే ఎజెండాగా మారిందని మండిపడుతున్నారు.

జగన్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సకాలంలో నీటిని కిందకు విడుదల చేయకుండా అమరావతిని ముంచడమే ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జలాశయాల నీటి నిర్వహణలోనూ కక్ష సాధింపు యోచనలకు పూనుకోవడం అమానుషమన్నారు చంద్రబాబు.మొత్తానికి రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి నీటిలో మునిగేలా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పనులకు పూనుకోవడం మంచిది కాదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. ప్రకృతితో పరిహాసం చేస్తే.. జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇకనైనా అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు.