English | Telugu

ట్రంప్ కు ట్విట్టర్, ఫేస్ బుక్ షాక్! యూ ఆర్ ఫైర్డ్ అంటూ నెటిజన్ల సెటైర్లు 

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కు అధికారం దూరమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్న వేళ ఆయనకు సోషల్ మీడియా సంస్థలు షాకుల మీద షాకులిచ్చాయి. తన ప్రత్యర్థి బైడెన్ టీమ్, తన విజయాన్ని దొంగిలించాలని చూస్తోందని ట్రంప్ చేసిన ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది."మనమే ముందున్నాం. అయితే, వారు ఈ ఎన్నికలను చోరీ చేయాలని చూస్తున్నారు. దాన్ని జరుగనివ్వబోము. ఎన్నికలు ముగిసిన తరువాత ఓట్లను వేయనిచ్చేది లేదు" అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వివాదాస్పదమైనదని, పౌర సమాజంలో జరుగుతున్న ఎన్నికల విధానంపై తప్పుడు సంకేతాలు పంపించేలా ఉందని అభిప్రాయపడ్డ ట్విట్టర్ దాన్ని తొలగించింది.

ఇక ట్రంప్ తాజా ట్వీట్ ను ఫేస్ బుక్ ఖాతాలో సైతం పెట్టగా.. ఫేస్ బుక్ యాజమాన్యం సైతం దాన్ని తొలగించింది. "తొలి దశ ఓట్ల లెక్కింపుతో పోలిస్తే, తుది ఫలితం వేరుగా ఉండవచ్చు. ఓట్ల లెక్కింపుకు రోజులు, వారాల సమయం కూడా పడుతుంది. ఈ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని ఫేస్ బుక్ వ్యాఖ్యానించింది. ఆ తరువాత విజయం తనదేనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సైతం ఫేస్ బుక్ ఫ్లాగ్ చేసింది.

నెటిజన్లు కూడా ట్రంప్ పై బోలేడు సెటైర్లు వేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం #YouAreFired అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. యూ ఆర్ ఫైర్డ్ అంటే.. నిన్ను ఉద్యోగం నుంచి తొలగించారు అని అర్థం వస్తుంది. ‘ట్రంప్ ఇక నువ్వు బట్టలు సర్దుకుని సిద్దంగా ఉండు.. నీ ఉద్యోగం పోయింది’ అంటూ నెటిజన్లు ట్విటర్‌లో చెలరేగిపోతున్నారు. ట్రంప్‌పై ఒక రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. డెమొక్రాట్లు మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటున్న ట్రంప్ .. సుప్రీంకోర్టుకు వెళ్తానని కూడా బెదిరిస్తున్నారు. దీంతో పూర్తి ఫలితాలు వచ్చి ఒకవేళ ట్రంప్ ఓడిపోతే ఏం చేస్తారన్నదానిపైనా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఓట్ల లెక్కింపును ఆపండి అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ పై పర్యావరణ ప్రేమికులు గ్రెటా థన్‌బర్గ్ కూడా విమర్శలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ తన యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై తప్పక పనిచేయాలి. అనంతరం ఓ స్నేహితుడితో కలిసి మంచి సినిమాకు వెళ్లాలి. చిల్ డొనాల్డ్, చిల్’ అని ఆమె రాసుకొచ్చారు. గ్రెటా థన్‌బర్గ్ గతంలోనూ ట్రంప్‌పై అనేక విమర్శలు చేశారు. అమెరికన్లు జో బైడెన్‌కే ఓటేయాలంటూ కొద్ది రోజుల కిందట అమెరికన్లను కోరారు థన్‌బర్గ్.

మరోవైపు మెయిల్-ఇన్ ఓటింగ్ ఒక అవినీతి వ్యవస్థ అంటూ అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైట్‌హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ట్రంప్.. ఎన్నికల్లో డెమొక్రాట్లు మోసానికి పాల్పడుతున్నారని మరోసారి ఆరోపించారు. మీడియా, టెక్ జోక్యం ఉన్నప్పటికి నేను ఇప్పటికే అనేక నిర్ణయాత్మక రాష్ట్రాలను గెలుచుకున్నాను. వారంతా ఊహించినట్టు ఎక్కడా బ్లూ వేవ్ లేదు, దానికి బదులుగా రెడ్ వేవ్ ఉంది. సెనేట్‌ విషయంలో అద్భుతమైన పనితీరు కనబర్చాం. మరింత మంది రిపబ్లికన్ మహిళలు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు’ అని చెప్పారు. మెయిల్-ఇన్ బ్యాలెట్లను అవినీతి వ్యవస్థగా అభివర్ణించారు. ‘మెయిల్-ఇన్ ఓటింగ్ ఒక అవినీతి వ్యవస్థ. వారికి ఎన్ని ఓట్లు అవసరమో తెలుసుకుని.. ఆగి.. ఆ ఓట్లను కనుగొంటున్నారు. వారు అకస్మాత్తుగా బ్యాలెట్లను కనుగొంటున్నారు.. అవన్నీ ఏకపక్షంగా ఉన్నాయి’ అని అన్నారు. పెన్సిల్‌వేనియాలోని మెషీన్లు డెమొక్రాట్ల అవినీతి రాజకీయ వ్యవస్థలో భాగమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.