English | Telugu

ఆలయంలో పూజ చేస్తూ అక్కడే కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే

వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలుసు అంటారు మన పెద్దలు. ఈ నానుడిని నిజం చేస్తూ.. తాజాగా ఒక మాజీ ఎమ్మెల్యే ఆలయంలో పూజలు చేస్తూ అక్కడే కుప్పకూలి కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌లోని బైతుల్‌లో.. మాజీ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కోశాధికారి అయిన వినోద్ డాగా ధన్‌తేరాస్ సందర్భంగా జైన్ దాదావాడీ (జైన్ టెంపుల్) ఆలయంలో పూజ చేసేందుకు వెళ్లారు. ముందుగా ఆయన ఆలయంలోని పార్శ్వనాథునికి పూజలు నిర్వహించారు. ఆ తరువాత దాదా గురుదేవ్ మందిరంలో ప్రదక్షిణలు చేసి, పూజ చేసి తరువాత దాదా గురుదేవ్ పాదాలకు మోకరిల్లారు. తరువాత అక్కడి నుండి పక్కకు కదిలేలోగానే కొన్ని సెకెన్ల వ్యవధిలోనే వినోద్ డాగా కుప్పకూలి ప్రాణాలొదిరారు. అయితే అదే సమయంలో ఒక బాలుడు మందిరంలోకి వచ్చి, మాజీ ఎమ్మెల్యే కిందపడి ఉండటాన్ని గమనించి పూజారికి తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పూజారి, ఇతర భక్తులతో కలిసి ఆయనను లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన పూజలు చేస్తూ.. మరణించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కావడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.