English | Telugu

ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు

క‌రోనా‌ కారణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వాయిదా పడిన స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఏపీలో కరోనా ఉధృతి తగ్గడంతో తొలి విడతగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. పంచాయ‌తీ ఎన్నిక‌లు పార్టీల‌క‌తీతంగా జ‌రిగేవి కావ‌డంతో.. న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు ఉండే అవ‌కాశం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలతో ఎన్నికలపై చర్చించామని.. ఎన్నికల షెడ్యూల్‌ ను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ఖరారు చేస్తామని అన్నారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ద, న్యాయబద్ధమైన బాధ్యతని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా.. భవిష్యత్‌లో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అని ఆయన తెలిపారు.

ఏపీలో కరోనా ఉధృతి తగ్గడంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అనుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని చెప్పారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీలో కరోనా అదుపులోకి వస్తోందని.. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నిస్వార్ధంగా పని చేస్తున్నారని కొనియాడారు. గతంలో 10 వేల కేసులుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 753కి తగ్గిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతోనే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ ప్రశంసించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని నిమ్మ‌గ‌డ్డ‌ తెలిపారు.