English | Telugu
దిగొచ్చిన కొత్తా దేవుడు! ప్రత్యేక మర్యాదలు సస్పెండ్
Updated : Nov 17, 2020
ఈ నెల 18న శారదాపీఠం స్వామీజి స్వరూపానంద పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా 23దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. హైకోర్టు విచారణ సందర్భంగా తాము రాసిన లేఖ ను వెనెక్కి తీసుకుంటున్నామని తెలిపారు శారదా పీఠం తరపు న్యాయవాది. దీంతో విశాఖ పీఠాథిపతి స్వరూపానందుల వారికి చేయ తలపెట్టిన ప్రత్యేక మర్యాదలపై దేవాదాయశాఖ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో ఇద్దరు ముఖ్యమంత్రుల ముద్దుల స్వామిముచ్చట తీరకుండా పోయింది.
విశాఖ పీఠాధిపతి జన్మదినం సందర్భంగా ప్రత్యేక ఆశీర్వచనాలు ఇవ్వాలని 23 దేవాలయాలకు దేవాదాయశాఖ కమిషనర్ లేఖ రాయడమే వింత. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహంవ్యక్తమైంది. సర్వసంగ పరిత్యాగులు- సన్యాసులకు జన్మదిన వేడుకలేమిటన్న చర్చ జరిగింది. సన్యాసి అంటే స్వయంగా నారాయణ స్వరూపుడు. సన్యాసులు ఆశీర్వదించాలే తప్ప, ఆశీస్సులు తీసుకోవడం ఉండదు. నారాయణ స్వరూపులు ఎదురయితే యమధర్మరాజు కూడా పక్కకు తొలగి దారి ఇచ్చారని చెబుతారు. అలాంటిది ఆలయ ప్రధాన అర్చకులే తరలివచ్చి విశాఖ స్వామి వారిని ఆశీర్వదించడమేమిటన్న ప్రశ్న ప్రజల నుంచి వచ్చింది. అసలు ప్రధానార్చకులు ఆలయంలోని మూలవిరాట్టును వదలి బయటకు రాకూడదు. మరి విశాఖ వేలుపు వద్దకు వెళ్లడమంటే.. స్వయంగా ఆ దేవదేవతలే విశాఖ స్వామి వద్దకు వెళ్లినట్టు కాదా అని పండితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.