English | Telugu
ప్రియాంక తలకు చుట్టుకుంటున్న హుస్సేన్ పెయింటింగ్ విక్రయ వ్యవహారం!
Updated : Mar 10, 2020
కాని కాలం లో పైన వేసుకున్న బట్టే పామై కరుస్తుందని సామెత. అలా అయింది ప్రస్తుతం గాంధీ కుటుంబం పరిస్థితి. అప్పుడెప్పుడో ఎఫ్ ఎం హుస్సేన్ వేసిన పెయింటింగ్ రాజీవ్ గాంధీకి బహుమతిగా ఇవ్వటమేమిటి... దాన్ని తర్వాత ప్రియాంక గాంధీ రాణా కపూర్ కి విక్రయించటమేమిటి ... అది ఈ రోజు ఎస్ బ్యాంక్ వ్యవహారం తో లింక్ అవటమేమిటి..... ఏమిటో పాపం గాంధీల ఫ్యామిలీకి అన్నీ సినిమా కష్టాలే ..... ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు రెండు కోట్లకు పెయింటింగ్ విక్రయించిన విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.
ప్రియాంక నుంచి ఈ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మిలింద్ దేవరా తనపై ఒత్తిడి తెచ్చారని ఈడీకి రాణా కపూర్ వాంగ్మూలం ఇచ్చారు. పెయింటింగ్ కోసం తాను ఇచ్చిన రెండు కోట్లతో ప్రియాంక సిమ్లాలో కాటేజ్ కొనుగోలు చేసిందని చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఓ కేసులో నిందితుడి నుంచి తీసుకున్న డబ్బుతో ప్రియాంక కొనుగోలు చేసిన కాటేజ్‌ను ‘నేరం ద్వారా వచ్చిన ఆదాయం’గా పరిగణించాల్సి ఉంటుందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆస్తిని తమ అధీనంలోకి తీసుకునే అధికారం ఈడీకి ఉంటుందని అంటున్నారు.
కపూర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రియాంకకు త్వరలోనే సమన్లు జారీ చేయడంతో పాటు సిమ్లాలోని కాటేజ్‌ను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రియాంక నుంచి రాణా కపూర్ కొనుగోలు చేసిన పెయింటింగ్‌ను సీజ్ చేసినట్టు ఎన్ఫోర్స్‌మెంట్ (ఈజీ) అధికారులు ప్రకటించారు. ముంబైలోని రాణా కపూర్ నివాసం నుంచి దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తాను గీసిన చిత్రపటాన్ని 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజీవ్ గాంధీకి బహూకరించారు. అయితే, 2010లో దీన్ని ప్రియాంక గాంధీ రెండు కోట్లకు రాణా కపూర్‌కు విక్రయించారు. ఈ పెయింటింగ్‌ను కొన్నందుకు ధన్యవాదాలు చెబుతూ రాణా కపూర్‌కు అప్పట్లో ప్రియాంక లేఖ రాశారు.
ఏది ఏమైనా కమలనాధులు ఉద్దేశ పూర్వకంగా గాంధీ ఫ్యామిలీ ని ముప్పతిప్పలు పెడుతున్నారా అనే సందేహాలయితే ఢిల్లీ 10, జనపథ్ కి బలంగా ఉన్నాయి.