English | Telugu

ఆందోళ‌న‌క‌రంగా ఎపి ఆర్థిక ప‌రిస్థితి!

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 6వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. సభలో గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదావేసి.. మార్చి 9వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి పద్దును ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ను కురసాల కన్నబాబు ప్రకటిస్తారు. వీరిద్దరూ మండలిలోనూ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు.

ప్ర‌స్తుత గ‌ణాంకాల‌ను క‌నుక ప‌రిసీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా వుంద‌నిపిస్తోంది.
పన్ను ఆదాయాలు, జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ ఫీజులు, ఎక్సైజ్ ట్యాక్స్, పన్నేతర ఆదాయం.. ఇలా ఏ విభాగం చూసినా అంచనాలకు తగినట్టు లేవు. అన్నిట్లోను భారీ కోతలే కనిపిస్తున్నాయి.

జనవరితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో ఆంధ్రాలో జీఎస్టీ వసూళ్లు కొంత పెరిగాయి. ఫిబ్రవరిలో రూ. 2,563 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. 2020 జనవరిలో ఈ వసూళ్లు రూ.2,356 కోట్లు. అంటే రూ.207 కోట్ల మేర పెరుగుదల నమోదైంది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగిన‌ప్ప‌ట్టికీ ఇత‌ర రెవెన్యూ వ‌సూళ్ళు ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో బ‌డ్జెట్ త‌ల‌కిందులైంది. ఇది బడ్జెట్ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మ‌రో ప్ర‌క్క జనవరి నెలాఖరు వరకు కేంద్రం నుంచి ఆశించిన రెవెన్యూ వసూళ్లలో రాష్ట్రానికి సగం కూడా దక్కలేదు. ఈసారి ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోవడం.. ఇతరత్రా కారణాలతో రాష్ట్రానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడింది.

కేంద్ర సాయంపైనా కేంద్రం నుంచి ఆశించిన దాంట్లో నాలుగో వంతు కూడా దక్కలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 61 వేల కోట్లకుపైగా వస్తుందని అంచనా వేశారు. కానీ.. జనవరి నెలాఖరు వరకు దక్కింది 13 వేల 558 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. ఆశించిన మొత్తంలో కేవలం 22 శాతం మాత్రమే. మొత్తం వసూళ్లపైనా ఇది ప్రభావం చూపింది.

ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక లక్ష 78 వేల 700 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేశారు. అయితే.. గట్టిగా 86 వేల కోట్లు మాత్రమే వచ్చింది. ఇది రాబడితో పోలిస్తే 48 శాతం మాత్రమే. గత సంవత్సరం కంటే ఈసారి మరింత వెనుకబాటు కనిపిస్తోంది.

2018-19 సంవత్సరంలో రెవెన్యూ వసూళ్ల అంచనా లక్ష 55 వేల 507 కోట్లు కాగా, 2019 జనవరి నెలాఖరు వరకు 91 వేల 755 కోట్లు వచ్చాయి. అంటే.. 59 శాతం.

బడ్జెట్ అంచనాల్లో మొత్తం 2.14లక్షల కోట్లుగా లెక్కిస్తే.. జనవరి నెలాఖరుకు వచ్చిన మొత్తం 1.33 లక్షల కోట్లు. అంటే 62 శాతం మాత్రమే. ఈ ప్రభావం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులపైనా కనిపిస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద 32 వేల 293 కోట్లు పెట్టుబడి వ్యయంగా బడ్జెట్ అంచనాల్లో చూపారు.
జనవరి నెలాఖరు వరకు కేవలం 7 వేల 297 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. బడ్జెట్ అంచనాల్లో ఇది కేవలం నాలుగో వంతు మాత్రమే.

అదే సమయంలో రెవెన్యూ లోటు కట్టలు తెంచుకుంది. బడ్జెట్ పద్దుల్లో రెవెన్యూ లోటును ఒక వెయ్యి 778 కోట్లుగా చూపించారు. జనవరి వరకు 10 నెలల కాలంలో లోటు.. 34 వేల 690 కోట్లకు చేరింది.
వాస్త‌వ ప‌రిస్థితులు ఇలా వుంటే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, న‌వ‌ర‌త్నాల‌పై దృష్టి పెట్టిన జ‌గ‌న్ స‌ర్కార్ బ‌డ్జెట్ ఎలా వుండ‌బోతుందోన‌ని ఉత్కంఠ‌త నెల‌కొంది.