English | Telugu
ఇసుక మాఫియాలో మంత్రులు!
Updated : Mar 2, 2020
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. 67 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, నలుగురు ఎంపీల పాత్ర ప్రత్యక్షంగా ఉందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు.
'గతంలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక రూ.5000కు చేరింది. రూ.10వేలు ఉన్న ట్రాక్టర్ ఇసుక రూ.50వేల నుండి లక్ష వరకు పలుకుతోంది. ప్రజలపై ఇంత దారుణంగా భారం వేస్తున్న విధానం అత్యుత్తమం ఎలా అవుతుంది.?' అని సత్యప్రసాద్ ప్రశ్నించారు.
ఒక యూనిట్ ఇసుకకు పర్మిట్ తీసుకుని వందలాది లారీల ఇసుకను అర్ధరాత్రి వేళల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ తెచ్చిన ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త పాలసీ పేరుతో దుర్మార్గానికి తెరలేపారని ఆరోపించారు.
'వైసీపీ నాయకులు మాఫియాగా ఏర్పడి ఇసుకను తెగనమ్ముకుంటున్నారు. ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేయండి, క్షణాల్లో చర్యలు తీసుకుంటామని మీరు ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు సమాచారం అందించినా స్పందించడం లేదని సత్యప్రసాద్ ఆరోపించారు.
వే బిల్లులు గానీ, పర్మిట్లు గానీ లేకుండా వందలాది లారీల ఇసుక సరిహద్దులు దాటిపోతోందన్నారు. ఇసుక తరలిస్తున్న ఏ వాహనానికి కూడా జీపీఎస్ లేకున్నా చర్యలు లేవు. ఇసుక రీచుల్లో సీసీ కెమెరాల నిఘా మచ్చుకు కూడా కనిపించడం లేదు.' అని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు. ఇసుక తవ్వకాల కోసం తీసుకున్న అనుమతులకు, జరుగుతున్న తవ్వకాలకు అసలు సంబంధమే ఉండడం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అధికార పార్టీకి చెందిన మంత్రలు, ఎంపీలు, శాసనసభ్యుపై ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి వందలాది ఫిర్యాదులు వచ్చినా పట్టించుకున్నవారు లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.