English | Telugu

ఒంగోలులో భూ ప్రకంపనలు

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భూమి కంపించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఒంగోలులో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. గద్దలగుంట, విజయ్‌నగర్‌ కాలనీ, మామిడిపాలెం, దేవుడిచెరువు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో జనం ఆందోళనకు గురయ్యారు.

ఇక, కర్ణాటక రాష్ట్రంలో హంపీ, జార్ఖండ్ రాష్ట్రంలో జంషెడ్‌పూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. హంపీలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. జంషెడ్ పూర్ లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైంది. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.