English | Telugu

తాగునీరు కలుషితం వల్లే వింత వ్యాధి! ఏలూరులో తగ్గని భయం 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధి మూలాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వింత వ్యాధి ప్రబలడానికి తాగునీరు కలుషితం కావడమే కారణమని కేంద్ర నిపుణుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాగునీటిలో పురుగుల మందుల అవశేషాలు కలవడమే కారణమని ప్రాధమికంగా నిర్ధారించారు. తాగునీటిలో ఆర్గానో క్లోరో, ఆర్గానో పాస్పరస్ అవశేషాలను కేంద్ర నిపుణుల కమిటి గుర్తించిందని తెలుస్తోంది. 90 శాతం నీటిలో ఈ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. తాగునీటిలో ఆర్గానో క్లోరో, ఆర్గానో పాస్పరస్ అవశేషాల ఎలా కలిశాయన్నదానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి కాలువల నీటిని కేంద్ర నిపుణుల కమిటీ పరిశీలించింది. రెండు కాలువల నీరు ఏయే ప్రాంతాలకు వెళ్తుందో.. ఏలూరు మ్యాప్‌ ద్వారా కేంద్ర నిపుణుల కమిటీ గుర్తించింది.

అలజడి రేపిన అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రి పాలై కోలుకున్నారని ఇంటికి పంపిన బాధితులను ఇంకా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఫిట్స్‌ తగ్గినా పూర్తిస్థాయిలో కోలుకోవడం లేదు. షుగరు, వెన్నునొప్పి, తలనొప్పి, నీరసం, భయం, కాళ్లూ, చేతులు గుంజుకుపోవడం, నరాలు సలపడం వంటి పలురకాల సమస్యలతో బాధపడుతున్నారు. కొందరైతే ఇంకా లేచి కూర్చోలేని పరిస్థితి. పూర్తిస్థాయిలో కోలుకోకుండానే తమను ఇంటికి పంపేశారని వింత వ్యాధి బాధితులు వాపోతున్నారు. దక్షిణపువీధిలో మొదలైన వింత వ్యాధి ఇప్పుడు కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 21 కొత్త కేసులు మాత్రమే వచ్చాయని వైద్యాధికారులు చెబుతున్నారు.