English | Telugu
ఫైజర్ వ్యాక్సిన్ తో బయటపడుతున్న కొత్త సైడ్ ఎఫెక్ట్ లు.. పునరాలోచనలో అమెరికా
Updated : Dec 10, 2020
ప్రపంచంలో ఏదైనా ఒక వ్యాక్సిన్ ట్రయల్స్ దశలో కొన్ని స్వల్ప సైడ్ ఎఫెక్ట్ లను చూపించడం సాధారణం. అలాగే ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న మొత్తం వాలంటీర్లలో 84 శాతం మంది ఏదో ఒక రియాక్షన్‌కు గురైనట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న తర్వాత 63 శాతం మందికి అలసట, ఆయాసం వస్తే.. 55 శాతం మంది తలనొప్పి వచ్చినట్లు తెలియజేశారు. అలాగే ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 32 శాతం మంది చలి వేసిందని, 24 శాతం మందికి కీళ్లనొప్పులు, మరో 14 శాతం మంది జ్వరంతో బాధపడ్డారని సమాచారం. అయితే కొన్ని స్వల్ప సైడ్ ఎఫెక్ట్ లు తప్పిస్తే ఇతర సమస్యలేమీ లేకపోవడంతో ఎఫ్‌డీఏ నుంచి ఫైజర్ వ్యాక్సిన్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ, తాజాగా మూడో దశ ట్రయల్స్‌లో నలుగురు వాలంటీర్లు అస్వస్థకు (ముఖ పక్షవాతం) గురికావడంతో ఎఫ్‌డీఏ ఈ వ్యాక్సిన్ విషయమై పునరాలోచనలో పడిందని సమాచారం.
ఇక మరో ప్రక్క ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్రిటన్ లో మంగళవారం నుండి ఫైజర్ వ్యాక్సిన్ ను ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే, అక్కడ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. అలెర్జీ ఉన్న వ్యక్తులపై ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని చూపిస్తున్నట్లు యూకే రెగ్యులేర్స్ సంస్థ పేర్కొంది. దీంతో అలెర్జీ ఉన్న వ్యక్తులు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవద్దని హెచ్చరించింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాక్సిన్ 90 శాతం సత్ఫలితాలనిచ్చినట్లు పరిశోధకులు వెల్లడించడంతో కరోనా మహమ్మారికి మందు లభించినట్లేనని అందరూ సంతోషిస్తున్న సమయంలో ఇప్పుడు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రజలలో తీవ్ర ఆందోళన రేపుతోంది.