English | Telugu

కుక్కను కారుకు క‌ట్టేసి ఈడ్చుకెళ్లాడు

'కుక్కలు ఉన్నాయి జాగ్రత్త' అని రాసి మనుషులకు జాగ్రత్తలు చెప్పే రోజులు పోయి.. 'మనుషులు ఉన్నారు జాగ్రత్త' అని రాసి కుక్కలకు జాగ్రత్త చెప్పే రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. అతడు సినిమాలో 'ముసలోడే కానీ మహానుభావుడు' అన్నట్టుగా.. కేర‌ళ‌లోని ఎర్నాకులం జిల్లాలో ఓ ముసలి మహానుభావుడు.. బ‌తికున్న కుక్క‌ను కారు వెనుకాల క‌ట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కుక్క బాగా మొరుగుతూ.. ఇబ్బంది పెడుతోంది. దీంతో యూసుఫ్(62) అనే వ్య‌క్తి ఆ కుక్క అరుపులు భ‌రించ‌లేక దాన్ని అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లాలని భావించాడు. త‌న కారుకు వెనుకాల కుక్క‌ను క‌ట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాల‌ను బైక్‌ పై వెళ్తున్న అఖిల్ అనే యువ‌కుడు చిత్రీక‌రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు, గాయపడిన ఆ కుక్కను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. తర్వాత దానిని జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించాడు. కాగా, అఖిల్ పోస్ట్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు పోలీసుల‌కు చేర‌డంతో.. కుక్క‌ను కారుకు క‌ట్టేసి ఈడ్చుకెళ్లిన యూసుఫ్‌ ను అరెస్టు చేశారు.