English | Telugu

ప్రపంచం మొత్తం క్యా కరోనా.. ఏపీలో పదవులు బరోనా...

ఒక వైపు కరోనా ప్రపంచాన్ని మింగేయాలని చూస్తోంది..ప్రపంచ దేశాలన్నీ క్యా కరోనా అనే ఆలోచనలు చేస్తున్నాయి. ఏపీలో మాత్రం కరోనా అయితే మాకేంటి? మేం మా వాళ్ళతో పదవులు బరోనాకే మొగ్గు చూపుతాం అంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అదేదో వచ్చిందని ప్రభుత్వ కార్యక్రమాలను ఆపుకోవాలా? అన్నట్లుగానే ఉంది ఏపీలో ప్రభుత్వ వ్యవహారం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో మంత్రులు ఎంత మంది ఉన్నారో అంత మందికి పైగానే నామినేటెడ్ పదవులు.. అందులో క్యాబినెట్ హోదా కూడా కలిగిన వారు ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యమే.

సీఎంఓ నుండి ఢిల్లీ వరకు ఇంకా ముందుకెళ్తే ఇతర దేశాలలో కూడా ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. ఆయా దేశాల నుండి పెట్టుబడుల ఆకర్షణగా వీరిని ప్రభుత్వం నియమించిందని చెప్పుకుంటోంది. కానీ పది నెలలలో వీరు తెచ్చిన పెట్టుబడులు ఎన్నో.. ఏర్పాటు చేసిన మీటింగులు ఎన్నో ఆ ప్రభుత్వానికి కానీ సలహాదారులకు కానీ తెలుసో లేదో భగవంతుడికే తెలియాలి. రాష్ట్రంలో ఇలాంటి సలహాదారు పదవుల జాతర చిట్టా చాలా పెద్దదే.

ప్రభుత్వ సలహాదారులుగా ఎడాపెడా పోస్టింగులు ఇచ్చేశారు.. ఇస్తున్నారు.. ఇంకా ఇస్తారేమో కూడా. అది కూడా సీఎం జగన్ సొంత మీడియాలో పనిచేసిన వారిని లేదా తన సొంత సామజిక వర్గానికి చెందిన వారినే ఎక్కువగా ఈ నామినేటెడ్ పదవులలో కూర్చోబెడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు పదవులు పొందిన వారిలో ఆ రెండు క్వాలిఫికేషన్స్ ఉండడం అందుకు కారణం.

అదలా ఉంచండి.. ప్రస్తుతం ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో అసలైన సమస్య కరోనా కట్టడి. ప్రపంచం మొత్తం దీనిపై పోరాటం చేస్తుంది. ఇందుకోసం రోజుకి లక్షల కోట్ల నష్టాలను భరిస్తున్న ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను రక్షిస్తే చాలని తాపత్రయపడుతున్నాయి. ఏపీలో కూడా రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఇక్కడ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు కరోనా భయాందోళన నుండి ఎంతవరకు భరోసా కల్పిస్తున్నారో కానీ ఈ సమయంలో కూడా జగన్ పదవుల పందేరం మాత్రం ఆపలేదు. తాజాగా మరో ఇద్దరికి పదవులను పంచారు. సాక్షి ఏపీ ఎడిషన్‌కు రెడిసెంట్ ఎడిటర్‌గా పనిచేసిన ధనుంజయరెడ్డి అనే జర్నలిస్టును సీఎం సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో రమణారెడ్డి అనే విద్యాసంస్థల అధినేతను ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించారు. ధనుంజయరెడ్డిని ఈమధ్యనే సాక్షి పత్రిక నుండి తొలగించి మరో సీనియర్ జర్నలిస్టును నియమించారు. అయన కంటే ధనుంజయ్ జూనియర్ అయినా అప్పుడు సాక్షిలో పదవికి వైఎస్ కుటుంబంతో సన్నిహిత్యమే పనిచేసింది.

అదే ఇప్పుడు ఏకంగా సీఎం సలహాదారునిగా కూడా అదే పనిచేసినట్లుగా ఉందని ప్రభుత్వ వర్గాల భోగట్టా. అయితే.. ధనుంజయ్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయనే వారు కూడా ఉన్నారు. చిత్తూరు, విశాఖ జిల్లాలలో కొన్ని భూ దందాలకు పాల్పడ్డారని మీడియాలో కొందరు ఆరోపిస్తుంటారు. అయితే, అందుకు ఆధారాలు మాత్రం బయటకి రాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో అయన కూడా భాగమే.

అయితే.. రాష్ట్రంలో ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తుంది. ప్రభుత్వంలో కూడా అత్యవసర సేవలు మినహా అంతా లోక్ డౌన్ లోనే ఉన్నారు. ఇప్పుడే ఈ పదవుల నియామకానికి సమయం కుదిరిందా అని ప్రశ్నలు వస్తున్నాయి. అది కూడా ధనుంజయ్ రెడ్డి ముఖ్యంగా పంచాయతీ వార్డు మెంబర్లు, సచివాలయాలు విషయంలో సలహాలిస్తారట. ఏదేమైనా ఇలాంటి విపత్కర పరిస్తితుల్లో పేదలకు వెయ్యి ఇస్తూ లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము మరో మాజీ సాక్షి ఉద్యోగి ఖాతాలో పడుతోంది.