English | Telugu

త్వరలోనే కూలిపోతుంది... శివసేన సర్కారుపై ఫడ్నవిస్ జోస్యం

మరాఠా రాజకీయం మరో మలుపు తిరిగింది. ఎవరూ ఊహించని-విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఫడ్నవిస్... అంతే సంచలనం రేపుతూ... బలపరీక్షకు ముందే చేతులెత్తేశారు. బలనిరూపణకు సుప్రీం ఒక్కరోజు మాత్రమే టైమివ్వడంతో... గట్టెక్కడం కష్టమని భావించిన ఫడ్నవిస్‌... ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకున్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే, ఫడ్నవిస్ కూడా రిజైన్ చేశారు. దాంతో, బలపరీక్షకు ముందే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది.

అజిత్‌ పవార్ మద్దతు లేఖ ఇవ్వడంతో ఎన్సీపీ... తమతో ఉందనుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, కానీ... తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ఫడ్నవిస్ ప్రకటించారు. అయితే, బీజేపీని శివసేన మోసం చేసిందన్న ఫడ్నవిస్ నిప్పులు చెరిగారు. అధికారం కోసం హిందుత్వాన్ని సోనియా కాళ్ల దగ్గర ఫణంగా పెట్టారని మండిపడ్డారు. సైద్ధాంతిక విభేదాలున్నా... అధికారం కోసమే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ఏకమయ్యాయన్న ఫడ్నవిస్... త్వరలోనే ఈ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమన్నారు.

మొత్తం పరిణామాలను మరాఠా ప్రజలు గమనిస్తున్నారన్న ఫడ్నవిస్‌... ఇకపై తాము ప్రతిపక్షంలో కూర్చొని ప్రజావాణి వినిపిస్తామని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులను పోత్సహించే తత్వం తమది కాదని, అందుకే, ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. అయితే, కేవలం అధికారం కోసమే ఎన్సీపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపిన శివసేన ప్రభుత్వం మధ్యలోనే కూలిపోక తప్పదని జోస్యం చెప్పారు.