దేశ వ్యాప్తంగా ఈరోజు రైతులకు బాసటగా నిర్వహించిన ఒక రోజు బంద్ విజయవంతమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల పై రైతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ బంద్ జరిగింది. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో కలిసి ధర్నా చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ సంగతి లీక్ కావడంతో ఆయనను అడుగు బయట పెట్టకుండా ఢిల్లీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అయితే తాను సీఎం హోదాలో కాకుండా ఓ మామూలు వ్యక్తిలా రైతుల్ని కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే తాను బయల్దేరే సమయంలో పోలీసులకు తమ ప్లాన్ తెలిసిపోవడంతో బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సరిహద్దులో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలవడానికి బయల్దేరిన కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే బంద్ ముగియడంతో ఆయనకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది.
అయితే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధంపై ఆప్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కేజ్రీవాల్‌ను, రైతులను చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. దీంతో ఆప్ కార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ ఇంటి ముందు సిసోడియా ధర్నా నిర్వహించారు.