English | Telugu

హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో మరణమృదంగం... ప్రాణాలు కోల్పోతున్న ప్రయాణికులు...

మీరు చదువుతున్నది నిజమే, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తొందరగా వెళ్లాలనే ఆత్రుత... షార్ట్ కట్లో గమ్యాన్ని చేరాలన్న ఆశ... మరోవైపు నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... హెచ్చరిస్తున్నా... మైకుల్లో అనౌన్స్ మెంట్స్ చేస్తున్నా... పట్టించుకోకుండా తప్పటడుగులు వేస్తున్న ప్రయాణికులు తమతమ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు.

రైల్వేస్టేషన్లలో ట్రాక్ దాటడం నేరం... అందుకు వెయ్యి రూపాయల జరిమానాతోపాటు ఏడాది జైలుశిక్ష పడుతుంది. అయితే, జరిమానా, జైలుశిక్షను పక్కనబెడితే... రైల్వే ట్రాక్ దాటుతున్న ఎంతోమంది ప్రయాణికులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఎక్కువగా ఈ మరణాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా కనీసం ఐదారుగురు రైల్వే పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, పట్టాలు దాటుకుండా రైల్వే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... హెచ్చరిస్తున్నా... పోలీసులను కాపలాగా పెడుతున్నా... ప్రయాణికులు మాత్రం లెక్కచేయడంలేదు... రైల్వే ట్రాక్ దాటడం ప్రమాదకరమని తెలిసినా.... నిర్లక్ష్యంగా ముందుకెళ్తున్న ఎంతోమంది తమ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. తాజాగా భరత్ నగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో కేవలం రెండే రెండ్రోజుల వ్యవధిలో పట్టాలు దాటుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

రైల్వే ట్రాక్ దాటుతూ హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య నిజంగానే భీతిగొల్పుతోంది. ఎందుకంటే ట్రాక్ దాటుతూ గతేడాది162మంది మరణించగా... పలువురు గాయపడ్డారు. ఇక, ట్రాక్ దాటుతున్న ప్రయాణికులపై 2432 కేసులు నమోదు చేసి 9 లక్షల 45 వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. అయితే, తొందరగా వెళ్లాలన్న ఆత్రుతలో ప్రయాణికులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే చివరికి వాళ్ల ప్రాణాలు తీసేస్తున్నాయి. ట్రాక్ దాటుతూ మరణిస్తున్నవాళ్లలో ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ వెళ్లడం... ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకుని ట్రాక్ దాటటమే కారణంగా గుర్తించారు.

అందుకే, దయచేసి వినండి... రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక... రైల్వే స్టేషన్లలో ఉన్నప్పుడు ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ఫ్లాట్ ఫామ్ పైకి వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వినియోగించుకోండి... త్వరగా వెళ్లాలన్న ఆత్రుతతో రైలు పట్టాలను దాటుతూ మీ విలువైన ప్రాణాలను కోల్పోకండి.