English | Telugu

భారత్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కు బ్రేక్ 

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కబళిస్తున్న నేపథ్యంలో మానవాళి ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న వ్యాక్సిన్లలో ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్, మోడెర్నా, రష్యా వ్యాక్సిన్ల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇందులో కూడా అన్నిటి కంటే బాగా సక్సెస్ అవుతోందని వార్తలు వస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ మన దేశంలో మరి కొద్దీ రోజులలో అంటే ఆగస్టు నెలలో మొదలు కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ ట్రయల్స్ నిలిచి పోయాయి. మన దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు ఐన సీరం ఇండియా సంస్థ భారతీయుల పై ట్రయల్స్ కోసం చేసిన అభ్యర్ధన ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. భారత్ లో రెండు మూడు దశల క్లినికల్ ట్రయల్స్ అనుమతి కోసం సీరం ఇండియా సంస్థ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కు అభ్యర్ధన పంపగా దానిని డిసిజిఐ ఒక స్పెషల్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC) పరిశీలనకు పంపింది. ఐతే ఈ క్లినికల్ ట్రయల్స్ చేసే విషయం లో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసిందిగా సీరం ఇండియా కు ఎక్స్పర్ట్ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.

పూణే, ముంబైలలో 1600 మంది వాలంటీర్ల పై తాము క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని గతంలో సీరం ఇండియా సంస్థ ప్రకటించింది. ఐతే ఇదే విషయమై ఎక్స్పర్ట్స్ కమిటీ మాత్రం కొన్ని మార్పులు చేయాలని కోరినట్టుగా సమాచారం. ట్రయల్స్ కేవలం రెండు నగరాలలో కాకుండా దేశ వ్యాప్తంగా చేయాలనీ దీనితో పాటు వ్యాక్సిన్ ప్రభావం పై మరింత లోతైన విశ్లేషణ కూడా చేయాలనీ దీని కోసం సీరం సంస్థ పంపిన అప్లికేషన్ లో మరో ఎనిమిది మార్పులు చేయాలనీ ఎక్స్పర్ట్ కమిటీ సూచించింది. దీంతో సీరం ఇండియా సంస్థ తమ అభ్యర్ధనలో మార్పులు చేసి మళ్ళీ డిసిజిఐ కి పంపవలసి ఉంది. ఆ అభ్యర్ధనను ఎక్స్పర్ట్స్ కమిటీ (SEC) ఆమోదించిన తరువాత మాత్రమే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. దీంతో భారత్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఆలస్యం కావచ్చని సమాచారం.