English | Telugu
పర్చూరు నియోజక వర్గంలో అసలు ఏం జరుగుతోంది?
Updated : Oct 3, 2019
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పర్చూరు నియోజక వర్గంలో తిరుగులేని నేత నిన్నటి వరకు ఓటమెరుగని నేతగా ఉన్న దగ్గుబాటి మొన్నటి ఎన్నికల్లో తొలి సారి ఓడిపోయారు. వైసిపి అధికారంలోకి రావడంతో పర్చూరు నియోజక వర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. అవినీతి మరక అంటని నేత దగ్గుబాటి, ఇదే ఇప్పుడు ఆయన కొంప ముంచేలా చేసింది, గతంలో టిడిపిలో ఉంటూ గ్రానైట్, ఇసుక మాఫియాను పెంచి పోషించిన నేతలే ఇప్పుడు వైసీపీలో చేరి ఆయనకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారట.
సీఎం జగన్ కు దగ్గుబాటి పై ఉన్నవీ లేనివీ నూరిపోసి తమ పబ్బం గడుపుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ ఇన్ చార్జిగా ఉంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి టిడిపి పంచన చేరిన రావి రామనాథం బాబుని తిరిగి వైసీపీకి చేర్చే విషయంలో దగ్గుబాటి వ్యతిరేక వర్గం సక్సెస్ సాధించింది. ఈ విషయంలో దగ్గుబాటిని సంప్రదించలేదన్న ప్రచారం ఉంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దగ్గుపాటి వెంకటేశ్వరావు తాడోపేడో తేల్చుకునేందుకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. సీఎంతో దగ్గుబాటి భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు నెలకొంటాయని దగ్గుబాటి అభిమానులు ఆందోళనలో ఉన్నారు.
మరోవైపు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి మధ్య గ్యాప్ ఉందని ప్రచారం నడుస్తోంది. అధికారుల బదిలీల విషయంలో వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి అనేది టాక్. ఈ గ్యాప్ ను ఇసుక, గ్రానైట్ మాఫియా క్రియేట్ చేసిందని దగ్గుబాటి వర్గం అంటోంది. అయితే రాజకీయాలలో తలపండిపోయిన దగ్గుబాటి తన ప్రత్యర్థుల ఎత్తులు చిత్తు చేసే వ్యూహం రచించారని తెలుస్తోంది. డైరెక్టుగా సీఎం జగన్ తో భేటీ సందర్భంగా పర్చూరు రాజకీయాన్ని వివరిస్తారని తెలుస్తోంది. అక్రమార్కులకు చెక్ పెట్టేలా ఆయన సీఎం దగ్గరకు పకడ్బందీ ప్లాన్ తో వెళతారని సమాచారం. మరి దగ్గుపాటి నెగ్గుతారా ఆయన వ్యతిరేక వర్గానికి చెక్ పెడుతుందా అనేది రెండుమూడ్రోజుల్లో తేలిపోతుంది.