English | Telugu

'ఉత్తరకుమారుడు' గా సి.పి.ఐ రామకృష్ణ రూపాంతరం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సి పి ఐ కార్యదర్శి కె రామకృష్ణ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యువకుడు, ఉత్సాహవంతుడు, కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఆరితేరిన వాడు... అలాగే లేఖాస్త్రాలు సంధించటం లో నిష్ణాతుడిగా ఇటీవలి కాలంలో విపరీతంగా పాపులారిటీ కూడా సంపాదించేసి, సొంత పార్టీ వారే అసూయపడే స్థాయికి ఎదిగారు. ఆయన తాజాగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు లేఖ రాసి, మరో సరి వార్తల్లోకి ఎక్కారు.

కరోనా కారణంగా చేయటానికి చేతిలో ఉద్యమాలు లేకపోవటం తో, ఆయన ప్రస్తుతానికి తన పెన్నుకి పదును పెట్టి , 'ఉత్తర కుమారుడి ' గా రూపాంతరం చెందారు. నిన్న సాయంత్రం వర్షం పడిందో లేదో, వెంటనే రామకృష్ణ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు లేఖ రాసేశారు. అకాల వర్షం బీభత్సంతో మరణించిన వారిక కుటుంబాలకు రు.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో వరి, పెసర, మిర్చి, మొక్కజొన్న, అరటి, మామిడి తదితర పంటలు, పండ్ల తోటలు, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని గణాంకాలతో సహా ఆ లేఖలో వివరించారు. 14 మంది మృత్యువాత పడిన విషయాన్ని కూడా, ఆయన మంత్రి బోస్ కు గుర్తు చేశారు. (మరేమి కాదు, కరోనా హడావుడి లో పడి, ప్రభుత్వం ఎక్కడ ఈ విషయం మర్చిపోతుందోననే అనుమానంతోనే రామకృష్ణ ఆ విషయం గుర్తు చేశారు సుమీ).

కరోనా విపత్తుకు తోడు వర్ష బీభత్సం రైతులకు శాపంగా పరిణమించిందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు రామకృష్ణ. పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అంచనావేసి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనసేన తో కాపురం చట్టబండలు అయిపోయిన తర్వాత, ఒంటరిగా మిగిలిపోయిన కమ్యూనిస్టు పార్టీకి ఎదో రకంగా ఆక్సిజన్ అందించేందుకు రామకృష్ణ పడుతున్న ఈ 'ఉత్తర ' శ్రమ వృధా పోకూడదని మనమందరమూ కూడా కోరుకుందాం.