English | Telugu

నీతి లేని బ్రతుకులు.. చనిపోయిన వారి పేరు మీద పట్టాలు ఇస్తున్న అధికారులు!

రెవిన్యూ ఆఫీసుల్లో అవినీతి అలజడి రేపుతోంది. ఏ పనికైనా పైసా లేనిదే పని కావడం లేదన్న ఆరోపణలకు బలం చేకూరుతున్నాయి. తహసీల్దార్ విజయరెడ్డి హత్య తరువాత ఏమైనా మార్పు వచ్చిందా అంటే అది కనిపించటలేదు. అవినీతికి అలవాటు పడిన కొందరు ఇంకా బల్లకింద చేయి పెడుతూనే ఉన్నారు. పట్టాల కోసమో ఇతరత్రా పనుల కోసం రెవెన్యూ ఆఫీసులకు వస్తున్న అన్నదాతలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. చెప్పులు అరగడం తప్ప ఒక్క పని కావడంలేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రోజులు నెలలు కాదు సంవత్సరాల తరబడి తిరుగుతున్న పని కావడం లేదన్న ఆందోళన మాత్రం రైతన్నల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో దిక్కుతోచని స్థితిలో కొందరు రైతన్నలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయ్యా.. అమ్మా.. అని వేడుకున్నా పని కాకపోవడంతో అబ్దుల్లాపూర్ మెట్ ఘటన తరహాలో కొందరు దాడులకు దిగే యత్నం చేస్తుండగా.. మరి కొందరు నిస్సహాయ స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరైతే మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ టార్చర్ ను భరించడం తమ వల్ల కాదని వాపోతున్నారు.

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన అయినాల శంకర్ దీ ఇదే పరిస్థితి. శంకర్ 9 ఏళ్ల క్రితం 8 ఎకరాల భూమి కొన్నాడు. బీడు భూమి కొని సాగు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే దాన్ని రిజిస్ర్టేషన్ చేయడం పై పాత యజమాని విష్ణు తాత్సారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే అతను చనిపోగా శంకర్ కి కూడా యాక్సిడెంట్ అయింది. ఈ క్రమంలో విష్ణు భార్య ఆ భూమి విషయంలో వీఆర్వో సహాయంతో వన్ బీ పట్టా పొంది తన పేరు మీదకు మార్చుకుంది. దీంతో మరింత ఆవేదనకు గురైన శంకర్ తండ్రి ఉప్పలయ్య హార్ట్ ఎటాక్ తో చనిపోగా తాను కూడా బతకడం వృథా అని శంకర్ వాపోతున్నాడు. అనుమతిస్తే మెర్సికిల్లింగ్ కు సిద్దమని రెవెన్యూ కార్యాలయాలం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఇదిలా వుంటే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఇటీవల మరో ఘటన జరిగింది. జీల కనకయ్య అనే రైతు తన భూమికి సంబంధించిన పాస్ బుక్కుల కోసం తిరిగి తిరిగి అలసి పోయాడు. ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి అధికారులపై చల్లే యత్నం చేసి అరెస్టయ్యాడు. ఇక వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ తహసీల్దార్ గా డీఎస్ వెంకన్న ఇటీవల చార్జి తీసుకునేందుకు వచ్చాడు. అయితే తన చాంబర్ లో ఒకే టేబుల్ ఉండటాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అలా కాదని మూడు టేబుళ్లను ఆ టేబుల్ ముందు రక్షణగా ఉంచాలన్న కండిషన్ ని పెట్టాడు. అలా అమర్చాకే మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంటే మొత్తంగా ఓ భయమైతే రెవెన్యూ అధికారుల్లో నెలకొంది. కానీ అవినీతికి పాల్పడటము, డబ్బులు తీసుకోకుండా పని చేస్తామని మాత్రం చెప్పడం లేదు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహాలతో మరింత భద్రత కావాలన్న డిమాండ్ ను తీసుకురావటం వాళ్ల పని తీరుకు అద్దం పడుతోందన్న విమర్శ వినిపిస్తోంది.