English | Telugu

ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ ఇక క‌రోనా పరీక్షలు!

దేశంలోని 52 ల్యాబ్‌ల్లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం మాత్రమే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇక నుంచి అధీకృత ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ కరోనా వైరస్ పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వుంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ కేవలం గాంధీ హాస్పిటల్‌లో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో తిరుపతి స్విమ్స్‌లో, విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో, అనంతపురంలోని జీఎంసీలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే ఉన్న సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలోని వైరల్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నొస్టిక్‌ లేబొరేటరీలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించారు. రూ. 23 లక్షలతో రియల్‌ టైమ్‌ పోలిమెరేజ్‌ చెయిన్‌ రియాక్షన్‌ పరికరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. త్వరలోనే కాకినాడ ఆర్ఎంసీ ల్యాబ్‌లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.

కరోనా అనుమానితులకు ప్రభుత్వం ఉచితంగానే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. కానీ ఒక్కోసారి టెస్ట్ చేసినందుకు గానూ రూ.6 వేలకుపైగా ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది. ప్రయివేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు అందుబాటులోకి వస్తే.. వాటిల్లో నిర్ధారణ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.